భారీ ప్రణాళికతో “ఔటర్” మణిహారం…!

జాతీయ రహదారుల వెంట ఉన్న నగరాలు, పట్టణాల్లో ఔటర్‌, ఇన్నర్‌ రింగు రోడ్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీ వాహనాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన బండ్లు నగరాలు, పట్టణాల్లోకి రాకుండా.. బయటి నుంచే వెళ్లిపోయేలా ఔటర్‌ రింగ్‌ రోడ్డులను నిర్మించడంతోపాటు ఆయా నగరాలు, పట్టణాల ప్రజల పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఇన్నర్‌ రింగు రోడ్డులనూ నిర్మించనున్నారు. నగరాలు, పట్టణాల నుంచి వెళుతున్న జాతీయ రహదారులను విస్తరించడం సర్కారుకు కష్టతరమవుతోంది. భూసేకరణ ఖరీదైన ప్రక్రియ కావడంతోపాటు.. ఇళ్లు, దుకాణ సముదాయాలను కోల్పోతున్న ప్రజలకు పునరావాసం కల్పించడం సంక్లిష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్లు ఉండాలని సర్కారు భావిస్తోంది.
వీటి నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి, స్థిరాస్తి వ్యాపారం భారీగా పుంజుకుంటుందని, కొత్తగా పరిశ్రమలు, కంపెనీలు కూడా భారీగా తరలివచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అందులో భాగంగా అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, కాకినాడ, తాపేశ్వరం, భీమవరం, తణుకు, కల్యాణదుర్గం, కుప్పం, మడకశిర, ద్రాక్షారామం తదితర వాటికి ఔటర్‌ రింగు రోడ్డును ప్రతిపాదించారు. వీటిలో కర్నూలు, అనంతపురం, కాకినాడ నగరాలకు ఇన్నర్‌ రింగు రోడ్డులనూ ప్రతిపాదించారు. ఇవేవీ లేని వాటికి బైపాస్‌ రోడ్డులను ప్రతిపాదించారు. అయితే ప్రతిపాదిత రోడ్లలో కొన్నింటికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు, ఆర్థిక సాయం అవసరం ఉన్నట్లు తెలిసింది.
వీటిలో కొన్నింటిని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షి్‌ప(పీపీపీ), బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్సిట్‌ (బీఓటీ) పద్ధతుల్లో నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు కోర్‌నెట్‌ ప్లాన్‌ కింద కూడా కొన్ని రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతిపాదిత రహదారుల నిర్మాణానికి కనీసం రూ.3 వేల కోట్లపైనే అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఒక్క కర్నూలు జిల్లాలోని ఔటర్‌, ఇన్నర్‌ రింగు రోడ్డు నిర్మాణ ఖర్చే రూ.791 కోట్లు ఉంటుందని అంచనా. ఇటీవల ఆర్‌అండ్‌బీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఈ ప్రతిపాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *