భద్రతా బలగాల గుప్పిట కాశ్మీరం.. క్షణ క్షణం ఉత్కంఠ

42

కాశ్మీర్ లో ఏం జరగబోతోంది. ప్రస్తుతం రాజకీయ పండితులను, ప్రపంచ దేశాలను వేధిస్తున్న సమస్య ఇది. కాశ్మీర్ కు దాదాపు 35వేల సైనిక బలగాలను తరలించారు. కీలక స్థావరాల్లో వారిని మోహరించారు. కార్గిల్ సెక్టార్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవలు రద్దు చేశారు. సరిహద్దుల్లో బోఫోర్స్ శతఘ్నులను సిద్దం చేశారు, అత్యాధునిక యుద్ధ విమానాలను కీలక స్థావరాల్లో సరిహద్దుల వెంబడి ఉంచారు. నిత్యావసర వస్తువులను సమకూర్చారు. కాశ్మీర్ లో ఉన్న పర్యాటకులను, దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన విద్యార్థులను బయటకు పంపించేస్తున్నారు. గత 2రోజుల్లో మొత్తం 11వేలమంది టూరిస్ట్ లకు గాను, 10వేలమందిని వెనక్కు పిలిపించారు. కొత్తగా వచ్చే టూరిస్ట్ లు ఎవరికీ గదులివ్వొద్దంటూ శ్రీనగర్ లో హోటల్ యజమానులకు ఆదేశాలిచ్చేశారు. దీంతో అసలు కాశ్మీర్ లో ఏం జరగబోతోందన్న విషయం అంతుబట్టకుండా తయారైంది. ఈ పరిస్థితి చూసి సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు బంకర్లకు తరలిపోతున్నారు. కాశ్మీర్ లో మారుతున్న పరిస్థితుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 35-ఎ, ఆర్టికల్ 370ని రద్దుచేసేందుకు మోదీ ప్రభుత్వం పావులు కదుపుతోందన్న వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. వీటి రెండింటిని రద్దు చేస్తే కాశ్మీర్ కి ఉన్న ప్రత్యేక హక్కులు హరించుకుపోతాయి. అందువల్ల కాశ్మీర్ లో తీవ్రవాద అనుకూల పార్టీలు, తీవ్రవాదులు, భారీ స్థాయిలో హింసకు ప్రేరేపించే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీంతో కాశ్మీర్ మొత్తం భయంతో గడగడలాడుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి. మరో వారం రోజులు గడిస్తేకాని కాశ్మీర్ లో రాజకీయ వ్యవహారాలు, ఏ రూపు దిద్దుకుంటాయో తెలియదు. మరోవైపు అమర్ నాథ్ యాత్ర నిలిపివేయడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఇంత భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారంటే కేంద్రం ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతోందన్నది మాత్రం అందరికీ తెలుస్తున్నా, ఆ నిర్ణయం ఏంటనేది ఇతమిత్థంగా తెలియడంలేదు. మరోవైపు కాశ్మీర్ లో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆ దేశ భద్రతా కమిటీ సమావేశమైంది. మరోవైపు మిగతా పాశ్చాత్య దేశాలు కూడా కాశ్మీర్ లో ఉన్న తమ దేశస్తులను తిరిగి సొంత ప్రాంతాలకు వచ్చేయాలని పిలుపునిచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here