బ్యాంకర్ల ఆంక్షలతో లబ్ధిదారుల బెంబేలు…నెరవేరని ప్రభుత్వ లక్ష్యాలు!

బ్యాంకర్ల ఆంక్షలతో నిరుద్యోగ లబ్ధిదారులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారి పోతున్నాయి. అధికార పార్టీ నాయకులే ఏమిచేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఇటీవల జి.కొండూరు మండలంలో పలు వ్యాపార యూనిట్ల ఏర్పాటుకు, పశువుల పెంపకం నిమిత్తం వివిధ కార్పొరేషన్ల నుండి సబ్సిడీపై రుణాలు మంజూరు అయ్యాయి. ప్రభుత్వం సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నది. ₹2 లక్షల రుణానికి ₹1లక్ష సబ్సిడీ పోను ₹1లక్ష బ్యాంకు రుణంగా ఇవ్వాలి. అయితే బ్యాంకర్లు రుణం ఇవ్వడానికి సబ్సిడీ పోను మిగతా సొమ్మును ముందుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆంక్షలు విధిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ను లబ్ధిదారుని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరుమీద చేయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తర్వాతే రణం ఇస్తున్నారు. డిపాజిట్ కోసం అధిక వడ్డీకి లక్షలు తెచ్చి లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీలకు తీసుకురాలేని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. పశువుల కోసం రుణాలు మంజూరు కొరకు దరఖాస్తు చేసిన వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పశువులను ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేయాలనే నిబంధనలు లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. బ్యాంకరు డిపాజిట్ ₹50 వేలు, ఇన్సూరెన్స్ ₹5వేలు, రవాణా ఖర్చులు, వడ్డీలు, కార్యాలయాలు చుట్టూ తిరగటానికి అయ్యే ఖర్చులు అన్నీ పోను లబ్ధిదారులకు ₹40వేలు మాత్రమే మిగులుతున్నాయి. ₹40 వేలతో రెండు గేదెలు ఎలా కొనాలి..? అంటూ లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు,బ్యాంకర్లు, పాలకులు లబ్ధిదారుల ప్రశ్నలకు ఏమి సమాధానం చెబుతారు?. ఇతర ప్రాంతాల్లో  కొన్న గేదెలు ఇక్కడకు వచ్చేసరికి  బక్కచిక్కిపోయి  అనారోగ్యానికి  గురవుతున్నాయి. ఆ గేదెల వల్ల ఉపయోగం, ఆదాయం లేని కారణంగా తిరిగి అమ్మితే కనీసం సొమ్ము రాక లబ్ధిదారులు, వచ్చిన కాడికి తీసుకుని నష్టానికి గేదెలను కబేళాలకు అమ్మేస్తున్నారు. రుణాలపై ఎక్కువ వడ్డీ వసూలు చేస్తూ బ్యాంకర్లు డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇస్తున్నారు.బ్యాంకర్ల ఆంక్షలు ప్రభుత్వ నిబంధనలు  లబ్ధిదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. అధికార పార్టీ నేతలు కూడా దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పైకి చెప్పలేక, చెప్పుకోలేక పోతున్నారు. క్షేత్రస్థాయిలో విచారిస్తే వాస్తవాలు గోచరిస్తాయి. కార్పొరేషన్ల నుంచి మంజూరు చేస్తున్న సబ్సిడీ రుణాలు మంజూరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాకపోగా….. చెడ్డ పేరు వస్తోందని పలువురు టిడిపి నేతలే ఆవేదన చెబుతున్నారు. దీనిపై మంత్రి ఉమ గారు స్పందించి సమగ్రంగా విచారించి,లబ్ధిదారులకు న్యాయం చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *