బీజేపీ-వైసీపీ పొత్తు పొడిచింది !!

18

ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ, వైసీపీ మధ్య అంతర్గతంగా పొత్తు కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ప్రముఖ నాయకుల గెలుపు కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తనను నమ్ముకున్న నేతలను ‘త్యాగం’ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం 15 చోట్ల లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కొన్ని స్థానాల్లో బలమైన నాయకులను తప్పించి, బలహీన నేతలను ఇన్‌చార్జులుగా నియమిస్తున్నారన్న ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. నాలుగేళ్లుగా గుంటూరు-2 స్థానంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న బలమైన నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని జగన్‌ ఆకస్మికంగా తప్పించారు. ఇటీవలే పార్టీలో చేరిన ఏసురత్నానికి ఆ బాధ్యతలు అప్పగించారు.

ఈయనెవరో వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోసమే ఈ మార్పు జరిగిందని, గుంటూరు-2లో ఆయన గెలుపు అవకాశాలు పెంచడం కోసమే అప్పిరెడ్డిని తప్పించారని పేర్కొంటున్నారు. ఇదొక్కటే కాదు. సుమారు పది శాసనసభ, మూడు నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి వైసీపీ సహకరించేలా అంతర్గత ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఎంపీ స్థానాల్లో సిట్టింగ్‌లతోపాటు పురందేశ్వరి, కావూరి సాంబశివరావు ఉంటారని చెబుతున్నారు. ఆ ఇద్దరూ కన్నాతో కలిసి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన వారే కావడం గమనార్హం. కేసుల విషయంలో సహకరిస్తామన్న హామీ కారణంగానే జగన్‌ ఇలాంటి త్యాగాలకు సిద్ధపడుతున్నారని.. కొందరు బీజేపీ నేతలు పోటీ చేసే ప్రాంతాల్లో బలహీన నేతలను నిలపాలన్న డిమాండ్‌కు అంగీకరించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇంకోవైపు.. జగన్‌ ఆకస్మికంగా ఇన్‌చార్జులను మార్చడంపై వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్‌ స్థానంలో విడదల రజనీని ఇన్‌చార్జిగా నియమించడంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెత్తిన పాలుపోసినట్లుయిందని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

మైలవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన జోగి రమేశ్‌ను కాదని.. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు కృష్ణప్రసాద్‌ను నియమించారు. విజయవాడ తూర్పులో నాలుగేళ్లు ఇన్‌చార్జిగా ఉన్న భవకుమార్‌ను తప్పించి.. కొద్దినెలల క్రితం పార్టీలో చేరిన యలమంచిలి రవికి బాధ్యత అప్పగించారు. ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణను విజయవాడ సెంట్రల్‌ నుంచి అక్కడకు వెళ్లాలని సూచించారు. ఆయన స్థానంలో మల్లాది విష్ణును ఇన్‌చార్జిగా నియమించడంతో రాధా వర్గం జగన్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతోంది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని మార్చాలన్న యోచనలో జగన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here