బాయిల‌ర్ పేలుడు ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌రం; చంద్రబాబు


సూరంపల్లి పారిశ్రామిక వాడలో జరిగిన బాయిలర్ పేలిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఉదయం భవానీపురం ఆంధ్రా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ కామినేని శ్రీనివాస్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం దురదుష్టకరం, బాధకరమన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నవారు త్వరగా కొలుకోవాలని ఆయ‌న ఆకాంక్షించారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాల‌కు కంపెని యాజ‌మాన్యం త‌ర‌ఫున రూ.6 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 ల‌క్ష‌లు, గాయాలైన వారికి రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియాను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రక‌టించారు. ఈ సంద‌ర్భంగా సంఘటన జరిగిన వివరాలను ముఖ్యమంత్రి వివరిస్తూ శనివారం సాయంత్రం గన్నవరం మండలం సూరంపల్లి వద్ద బాయిలర్ పేలిన సంఘట‌నలో నలుగురు చనిపోవడం జరిగిందని, ఐదుగురు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఘటనలో శివశంకర్ కుమార్, ముజాహిద్ హమ్మద్, సత్యనారాయణ, అబ్దుల్ ముబారక్ అలీ చనిపోయారని ముఖ్యమంత్రి తెలిపారు. ఘటనలో గాయపడిన బాధితులకు ఆసుప‌త్రి వైద్య బృందం చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు సీఆర్డీఏ కమీషనర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం, ఆర్డివో ఎస్.హరీష్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *