ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై విస్త్ర‌త ప్ర‌చారం క‌ల్పించాలి

64

రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేయడానికి సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం విజ‌య‌వాడ‌ పండిట్‌నెహ్రూ బ‌స్టాండ్‌లోని సమాచార శాఖ కమీషనర్ కార్యాలయంలో ఆ శాఖ విధివిధానాలను సమీక్షించారు. క్షేత్రస్థాయిలో సమాచార శాఖ అధికారులు వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద పత్రికల్లో తగిన ప్రాచుర్యం కల్పించాలన్నారు. స్థానికంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో లబ్ధిదారుల విజయగాథలు ప్రచురించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి 15 రోజులకోసారి జిల్లాల్లో ప్రగతి నివేదికలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పబ్లిసిటీ కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. సమావేశంలో పాల్గొన్న సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి అధికారులు మరింత కృషి చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాల్లో జరుగుతున్న కార్యక్రమ వివరాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తీసుకెళ్లేందుకు యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల‌లో క్షేత్రస్థాయి అధికారులు నమోదు చేస్తున్నారని మంత్రికి వివరించారు. జాయింట్ డైరెక్టర్ పి.కిరణ్‌కుమార్ వందన సమర్పణ గావిస్తూ మంత్రి సూచనలు, సలహాల మేరకు సమాచార శాఖ అధికారులు కష్టపడి పనిచేసి ఒక నెలలోగా శాఖా పరంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సత్ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు సంచాలకులు ఎం.వి.వి.కృష్ణానంద్, సంయుక్త సంచాలకులు సూర్యనారాయణ మూర్తి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లీలాకుమార్, స్వర్ణలత, బాలగంగాధర్ తిలక్, వెంకటేష్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ మధుసూదన్, రీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, నాగరాజు, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక చీప్ ఎడిటర్ కందుల రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here