ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ప‌ది మీట‌ర్ల పూత‌రేకు

78

తెలుగు రుచుల‌ను మ‌రింత పాచుర్యంలోకి తీసుకువ‌చ్చే క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతుంద‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. వంట‌ల పోటీలు, ఆహార పండుగ‌లు, ప్ర‌త్యేక రికార్డుల న‌మోదు ఇలా ఎన్నో అంశాల‌లో ప‌ర్యాట‌క శాఖ త‌న‌దైన శైలిలో నిరంత‌రం కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంద‌న్నారు. పూత‌రేకు గొప్ప‌ద‌నాన్ని విశ్వ‌వ్యాప్తం చేసే క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ చేప‌ట్టిన ప‌దిమీట‌ర్ల పూత‌రేకు త‌యారీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం అయ్యింది. గురువారం సాయంత్రం జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, ప్రాధికార సంస్ధ సిఇఓ హిమాన్షు శుక్లా ఈ నూత‌న రికార్డుకు సంబంధించిన ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని ఇండియా బుక్ ఆప్ రికార్ట్స్ సంస్ధ స్ర‌తినిధుల నుండి అందుకున్నారు. విజ‌య‌వాడ బెరంపార్కులో గురువారం ఉద‌యం తొమ్మిది గంట‌ల నుండి ఈ ప్ర‌క్రియ జీవం పోసుకోగా, ఆరు గంట‌ల నిర్విరామ కార్య‌క్ర‌మం అనంత‌రం ప‌ది మీట‌ర్ల పూత‌రేకు రూపుదిద్దుకుంది. సాధార‌ణంగా ఐదు నుండి ఎనిమిది అంగుళాలు ఉండే పూత‌రేకునే మ‌నం చూస్తూ ఉంటాం. ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ ఇప్పుడు ప‌ది మీట‌ర్ల అత్యంత పొడ‌వైన పూత‌రేకును రూపొందించి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఫ‌లితంగా అతి పొడ‌వైన పూత‌రేకుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో మ‌న అత్రేయ‌పురం పూత‌రేకు సుస్ధిర స్ధానం ఏర్పాటు చేసుకుంది. పూత‌రేకు త‌యారీ అనేది ఒక వినూత్న ప్ర‌క్రియకాగా అందునా ప‌ది మీట‌ర్ల పూత‌రేకు అంటే ఇక ఎంత‌టి క‌స‌ర‌త్తు అవ‌స‌ర‌మ‌న్న‌ది చెప్ప‌న‌క్క‌ర లేదు. ఇందుకోసం గోదావ‌రి జిల్లాల నుండి త‌ల‌పండిన పాక శాస్త్ర నిపుణుల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క ప్రాధికార సంస్ధ ర‌ప్పించింది. ఈ నేప‌ధ్యంలో మీనా తయారు చేసిన పూత‌రేకును మీడియా సమక్షంలో కొలిపించగా, అది పదిన్నర మీటర్లు గా నమోదు అయింది. హిమాన్షు శుక్లా మాట్లాడుతూ రికార్డు పేరిట ఎటువంటి ఆధునిక పోక‌డ‌ల‌ను అన్వ‌యించ‌లేద‌ని, సాంప్ర‌దాయ‌క‌త వైపే మొగ్గు చూపుతూ కుండల‌పైనే పూత‌రేకును త‌యారు చేయటం జ‌రిగింద‌ని వివ‌రించారు. మ‌న‌వైన తెలుగు వంట‌కాల‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్ధాయిలో మ‌రింత ప్రాచుర్యం క‌ల్పించేందుకే ఇండియా బుక్ ఆప్ రికార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని ఎంచుకున్నామ‌ని మీనా వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ఆహారానికి అంతర్జాతీయ ప్రచారం జరగాలన్నారు. ఇప్ప‌టికే ఆంధ్రా వంట‌కాల‌ను ప్రోత్స‌హించే క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పండుగ‌లు చేప‌డుతున్నామ‌ని, మ‌రోవైపు అర‌కు బొంగు బిర్యానినీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ప్ర‌త్యేక వంట‌కంగా తీర్చిదిద్దే క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా వంట‌వారికి ప్ర‌త్యేక శిక్ష‌ణ అందిస్తున్నామ‌న్నారు. కార్య‌క్ర‌మంలో ఎపిటిఎ సిఎంఓ శ్రీ‌నివాస‌రావు, ప‌ర్యాట‌క శాఖ ఓఎస్‌డి ల‌క్ష్మ‌ణ మూర్తి, డైరెక్టర్ మురళి కృష్ణ, హరినాథ్, విశ్వనాధం, బేరం పార్క్ యూనిట్ అధికారి శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు. పూ త‌రేకు త‌యారీ నేప‌ధ్యంలో ఉద‌యం నుండి ప‌ర్యాట‌క అతిధిగృహం బెరం పార్కులో సంద‌డి నెల‌కొంది. న‌గ‌ర వాసులు ఈ ప్ర‌కియ చూసేందుకు పోటీలు ప‌డ్డార‌నే చెప్పాలి. ప్ర‌త్యేకించి గృహిణులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై త‌యారీదారుల‌ను ప్రోత్స‌హించారు. దీని త‌యారీలో ఆత్రేయ‌పురంకు చెందిన న‌లుగురు నిపుణుల‌తో పాటు తిరుప‌తికి చెందిన ఓ గృహిణి పాల్గొన్నారు. త‌య‌రీ కోసం ఒక కిలో బియ్యం పిండి, కిలో జీడిప‌ప్పు, కిలో పిస్తా ప‌ప్పు, కిలోన్న‌ర పంచ‌దార‌, కిలో బెల్లం, రెండు కిలోల నెయ్యి వినియోగించిన‌ట్లు ఎపిటిఎ వంట‌కాల ఉప సంచాల‌కులు నిషార్ అహ్మ‌ద్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here