ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే… బ్రహ్మోత్సవం

Special Show Wallpaper

నటీనటులు: మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత, సత్యరాజ్, రేవతి, రావు రమేష్, జయసుధ, నరేష్, సాయాజీ షిండే, బేబీ అక్షర, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రుషి, కృష్ణ భగవాన్ తదితరులు
సంగీతం: మిక్కీ జె.మేయర్, గోపీ సుందర్(నేపథ్య సంగీతం)
సినిమాటోగ్రాఫర్: రత్నవేలు
నిర్మాతలు: పి.వి.పి., ఎం.బి.ఎంటర్టైన్ మెంట్
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల
రేటింగ్: 2.75
శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు అభిమానుల్లోనూ భారీగానే అంచనాలు నెలకొన్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాంటి కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాలతో కలిసి రెండోసారి ‘బ్రహ్మోత్సవం’ చిత్రం చేశాడు మహేష్. మరి ఈ చిత్రం అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకుందో చూద్దామా?
స్టోరీ: చంటబ్బాయి(సత్యరాజ్) ఉమ్మడి కుటుంబానికి ప్రధాన్యత ఇచ్చే వ్యక్తి. నలుగురు కలిసి వుంటేనే… బంధాలు.. బంధుత్వాలు బలంగా వుంటాయనే నమ్మకం వున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి.. నలుగురు బావమర్దుల(రావు రమేష్, నరేష్, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్) కలిసి ఉమ్మడిగా జీవిస్తూ… రూ.400 కోట్ల విలువలు చేసే ఓ పెయింటింగ్ తయారీ కంపెనీని రన్ చేస్తూ వుంటాడు. ఇలా సరదాగా గడిచిపోతున్న సమయంలో చంటబ్బాయి.. పెద్ద బావమర్ది రావు రమేష్ తన కూతురుని చంటబ్బాయి కుమారుడు(మహేష్ బాబు)కిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అయితే మహేష్ బాబు మాత్రం తన ఇంటికి గెస్ట్ గా వచ్చిన అమ్మాయి(కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తాడు. ఇది తెలిసిన రావు రమేష్… ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి… వేరుకుంపటి పెట్టాలనుకుంటాడు. దాంతో హర్ట్ అయిన చంటబ్బాయి.. హఠాన్మరణం చెందుతాడు. అయితే చంటబ్బాయి మరణించే ముందు తన కుమారుడితో ఓ ప్రామిస్ చేయించుకుని మరణిస్తాడు. ఆ ప్రామిస్ ఏంటి? దాన్ని ఎలా నెరవేర్చాడు అనేదే మిగతా కథ.
స్టోరీ విశ్లేషణ: విలువులతో కూడిన సినిమాలను తీయడంలో శ్రీకాంత్ అడ్డాలది ప్రత్యేకమైన శైలి. ఎప్పుడో అంతరించిపోయిన కుటుంబకథా చిత్రాలకు మళ్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపంలో అంకురార్పణ చేసింది ఆయనే. అలాంటి కుటుంబ కథాచిత్రాన్ని మరోసారి మహేష్ తో తీయడానికి శ్రీకాంత్ అడ్డాల తీయడానికి రెడీ కావడంతో… అభిమానులు మరోసారి ఫీల్ గుడ్ ఎంటర్టైన్ మెంట్ సినిమాను చూడొచ్చని భావించారు. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఉమ్మడి కుటుంబం ప్రధాన్యతను చెప్పడానికి ఎంచుకున్న కథ మంచిదే అయినా.. కథనం వంకర టింకరగా సాగడంతో ప్రేక్షకులు చాలా సందర్భాల్లో నీరసించి.. ఎప్పుడెప్పుడు సినిమా ముగుస్తుందా అని డోర్లవైపు ధీనంగా చూస్తారు.
కేవలం హీరో స్టార్ డమ్ మీదనే ఆధారపడి రాసుకున్నకథనం ఏ సందర్భంలోనూ ఆకట్టుకోదు. హీరో పాత్ర అలా సాగిపోతూ వుంటే.. హీరోయిన్ల ఇంట్రడక్షన్ మాత్రం చాలా గమ్మత్తుగా వుంటుంది. ఫస్ట్ హాఫ్ లో కాజల్ లవ్ ఎపిసోడ్ తో ఇంట్రవెల్ కార్డు పడుతుంది. సెకెండాఫ్ లో సమంత ఇంట్రడక్షన్ తికమక పెట్టి.. క్లైమాక్స్ వరకూ కొనసాగుతుంది. హీరో మూలాలను తెలుసుకునేందుకు ఈమె క్యారెక్టర్ ను ద్వితీయార్థంలో ఇంట్రడ్యూస్ చేసిన దర్శకుడు… అసలు ఏమి చెప్పదలచుకున్నాడో ఎక్కడా క్లారిటీ లేదు. ఆమె వున్నట్టుండి హీరో చెల్లెలు ఫ్రెండుగా పరిచయమై… హీరోతో రొమాన్స్ ట్రాక్ ను నడపడానికి ఉపయోగపడింది తప్పితే.. కథలో ఎక్కడా కనెక్ట్ అవ్వదు.
సినిమా నిడివి మరీ ఎక్కువైందేమోనని భావించారో ఏమో… చాలా సందర్భాల్లో సీన్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోతూ వుంటాయి. దానికి తోడు మొదటి హాఫ్ మొత్తం పాటలతోనే సాగిపోతుంది. కేవలం డ్యాన్సులు.. ఉత్సవాలతోనే ప్రథమార్థాన్ని లాగించాడు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో రావు రమేష్ ప్రవర్థన కారణంగా హీరో తండ్రి చనిపోవడం.. ఆ తరువాత తన వంశం మూలాలను వెతుక్కోవడానికి ఉత్తర భారతదేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ తిరగడం వల్ల లొకేషన్లైతే అందంగా చూపించారు కానీ.. ఆ సీన్లన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. ఎక్కడా ప్రేక్షకులను కుర్చీలో కూర్చోబెట్టే సీన్లు లేవు. దాంతో బ్రహ్మోత్సవం మూవీ కాస్త… ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
మహేష్ బాబు నటన సినిమాకు హైలైట్. అతని అందం కూడా ఈ చిత్రానికి ప్లస్. ప్రతి సీన్లోనూ కనిపించి.. సినిమా మొత్తాన్ని భుజాన వేసుకుని నడిపించాడు. మొదటి హాఫ్ లో కాజల్ తో నడిపిన లవ్ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. సంభాషణలు కూడా బాగున్నాయి. అయితే ద్వితీయార్థంలో వచ్చే సమంత ఎపిసోడ్ తలా తోకా లేకుండా నడుస్తుంది. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఎంటి అనేది ఏదీ చెప్పకుండా కేవలం హీరో చెల్లెలు ఫ్రెండ్ గా పరిచయం చేసేసి.. ఆమె హీరోతో కనెక్ట్ అయిపోయే సీన్లను తెరమీద చూపించడం చాలా కృతకంగా కనిపిస్తుంది. మరో సారి రావు రమేష్.. తన నటనతో ఆకట్టుకున్నాడు. సత్యరాజ్ నటన బాగుంది. అయితే ఇతని నటన చాలా వరకు పాసివ్ గా కనిపిస్తుంది. బేబీ అక్షర క్యాన్స్ పేషంట్ గా నటించి మెప్పించింది. ఇక మిగతా క్యారెక్టర్లలో నటించిన తనికెళ్ల భరణి, సాయాజీ షిండే, కృష్ణ భగవాన్, నరేష్, జయసుధ, రేవతి, తులసి క్యారెక్టర్లు పర్వాలేదనిపిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ.. పీవీపీ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ మరింత గ్రిప్పింగ్ వుంటే బాగుండేది.
-Manu.Vadde

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *