ప్రత్యేక హోదా సాధనకు పవన్‌ నాయకత్వం సరిపోదు:ముద్రగడ


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం సరిపోదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం తిరుపతిలో జరిగిన బలిజల ఆత్మీయ కలయికలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎంపీలు, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి  ప్రత్యేక హోదా సాధనకు పోరాడాలని సూచించారు. ఇందుకోసం తమ జాతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ముద్రగడ అన్నారు.తహసీల్దార్ కార్యాలయం నుంచి బీసీ సర్టిఫికేట్ పొందినప్పుడే కాపులకు పండుగని అన్నారు. చంద్రబాబు జాప్యం వహించడం వల్లే కాపులంతా రోడ్లపైకి వచ్చారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి  త్రికరణ శుద్ధితో అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో జరగబోయే నియామకాల్లో బీసీ ఎఫ్‌ ద్వారా తమ జాతికి న్యాయం చేయాలని ముద్రగడ డిమాండ్‌ చేశారు.ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఎలా ఆకలి తీర్చుకోవాలో తమకు తెలుసునన్నారు.సరైన సమయంలో ఉద్యమించి  ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.కాపులను మోసం చేయాలని భావిస్తే,, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఎలా మోసం చేయాలో నిర్ణయిస్తామన్నారు. కాపుల రిజర్వేషన్ల విషయంలో సీఎం వెనకడుగు వేయరని భావిస్తున్నామని ముద్రగడ తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *