ప్రతిపక్ష నేత జగన్ కు పోలవరం చూసే తీరిక లేదు-మంత్రి దేవినేని

96

కర్నూలు జిల్లాకు అవుకు టన్నెల్ ద్వారా వారం రోజుల్లో నీరు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం జలవనరుల శాఖ కార్యాలయంలో పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జలాశయాలకు వస్తున్న నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని, రిజర్వాయర్లకు నీళ్లు వస్తున్నందున అధికారులు కాలువ వెంటే ఉండాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును ఇప్పటి వరకు లక్ష రెండు వేల మంది సందర్శించారని కానీ ప్రతిపక్ష నేత జగన్ కు మాత్రం పోలవరం చూసే తీరిక లేదని అన్నారు. గుంటూరు లో ముస్లింల సభను అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిర్మాణాత్మక ఆలోచనలు చేయడంలో ప్రతిపక్షం విఫలమైందని ఎద్దేవా చేశారు. రాజన్న రాజ్యంలో ఐఏఏస్ లు, మంత్రులు జైలుకు వెళ్లారని, మళ్లీ అలాంటి పరిపాలన చేస్తానని జగన్ చెబుతున్నారని, మోదీ కనుసన్నల్లో జగన్ పనిచేస్తున్నారని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ జిల్లాలకు నీరు అందిస్తున్నామని, లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం నుంచి, నాగార్జునసాగర్ నుంచి 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశామన్నారు. పులిచింతల లో ప్రస్తుతం 14.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈ ఏడాది పులిచింతలలో 45 టీఎంసీల నిల్వ చర్యలు చేస్తున్నట్లు వివరించారు. సాగర్ దిగువన ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామని, లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పులిచింతల నుంచి 45 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి, ప్రకాశం బ్యారేజి నుంచి కాలువల ద్వారా 14 వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. కర్నూలు జిల్లా అవుకు టన్నెల్ ద్వారా వారం రోజుల్లో నీరు విడుదల చేస్తామని, గండికోట ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి దేవినేని ఉమా తెలిపారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here