ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక జన్మభూమి

ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికే జన్మభూమి – మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం పలమనేరు రూరల్ మండలంలోని కొలమాసనపల్లె ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన 5 వ విడత జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా ప్రజల సమస్యలను గుర్తించి, త్వరితగతిన పరిష్కరించడానికి జన్మభూమి వంటి గ్రామసభలు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెదేపా అధికారంలోకి వచ్చినప్పటినుండీ జన్మభూమి కార్యక్రమం అమలు చేస్తున్నారని, తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు ఇదే కార్యక్రమానికి పేరు మార్చి అమలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడానికి జన్మభూమి లాంటి గ్రామ సభలు చక్కని అవకాశమన్నారు. తొలుత ఆయన కొలమాసనపల్లె గ్రామంలో తెదేపా జెండాను ఆవిష్కరించారు. అలాగే రూ. 8 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం ప్రారంభించి, ఎస్సీ కాలనీలో రూ.15 లక్షలతో నిర్మించే OHSR ట్యాంకు నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. కొలమాసన పల్లె సమీపంలో రూ. 80 లక్షలతో నిర్మించిన సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహాన్ని ప్రారంభించారు. అదే గ్రామంలో రూ. 2.20 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను, రూ. 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. మత్స్య శాఖ ఆద్వర్యంలో ఎగువ కూర్మాయి చెరువులో చేప పిల్లలను వదిలిపెట్టారు. అనంతరం కొలమాసనపల్లె ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొని మండల మహిళా సమాఖ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టరును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా కోశాధికారి ఆర్వీబాలాజి, సుధీర్ కుమార్ రెడ్డి, హేమంత్ కుమార్ రెడ్డి, ఆర్బీసీకుట్టి, కిషోర్, చాంద్ భాషా, మండల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *