ప్రజాకోర్టులో దోషులెవరు?

136

ప్రజాకోర్టు తీర్పు ప్రస్తుతం ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఈలోగా మనం మంచిచెడ్డలు బేరీజు వేసుకోవాల్సిన అవసరముంది. ప్రజాకోర్టు బోనులో ప్రధానంగా అధికారపక్షమే ఉంటుంది. నేతలే అనుకుంటే… ఓటర్లు అంతకుమించి. కల్లబొల్లి మాటలను అంతతేలిగ్గా ఎవరూ నమ్మటం లేదు. 13 జిల్లాలలో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అంతటా ‘గాలి’వాటమే కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరిగిందో ఆరాతీస్తే చాలా
కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. అందువల్ల ఈసారి ఓటరు సంచలనాత్మకమైన తీర్పు ఇస్తున్నాడనే చెప్పాలి. మధ్యలో ఉన్న మూడో ప్రత్యామ్నాయంవల్ల ఈ తీర్పును అంచనా వేయడం కూడా కష్టమే.
చేటు తెచ్చిన స్థానిక నాయకత్వాలు
– ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే ఎమ్మెల్యేలు, వారి అనుచర గణం. ఏ ప్రభుత్వ పథకం వచ్చినా అందిపుచ్చుకోవడానికి వీరు ముందుంటున్నారు. అది పక్కా గృహమే కావచ్చు, డ్వాక్రా రుణమే కావచ్చు, రైతు రథమే కావచ్చు… ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు.
– పింఛను గురించి జనాన్ని వాకబు చేస్తే ఆ క్రెడిట్ ను ప్రతిపక్షనేతకే అంటగట్టారు. ఆయన 2000 అన్నారు కాబట్టి ఈయనగారు ఇస్తున్నారు. ఆయన 3000 ప్రకటించారు కాబట్టి ఈయన కూడా ఇస్తున్నారు. ఈ మూడు వేలు ఎప్పుడు ఇస్తారో తెలుసా… మళ్లీ ఈయనే అధికారంలోకి వస్తే 2024 ఎన్నికలకు ముందు మాత్రమే ఇస్తారు.
– రుణమాఫీ కారణంగా కట్టిన అపరాధపు వడ్డీ ఎంత? డ్వాక్రా రుణాల కారణంగా కట్టిన వడ్డీలు ఎంత ? ఇవన్నీ లెక్కలు తీయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికలకు ముందు పసుపు – కుంకుమ గుర్తొచ్చిందా? అని ఎదురు ప్రశ్నించినవారూ ఉన్నారు.
– ఒక్కసారి మార్పు చూస్తే తమకు ఇంకా ఎక్కువ ప్రయోజనం జరుగుతుందేమోనని ఆలోచించినవారే ఎక్కువ ఉన్నారు.
ఏదయా మీడియా?
ఒకప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన మంచిచెడులను తెలుసుకోవాడానికి పత్రికలు చాలా ఉపయోగపడేవి. ప్రజల పక్షాన నిలిచే ఒక్క పత్రిక, టీవీ ఛానల్ లేదు. అన్నీ పార్టీల పక్షాన నిలిచేవే. దీంతో సోషల్ మీడియా పేట్రేగిపోయింది. ఇది మరింత గందరగోళానికి దారితీసిందే తప్ప వేరే ఒనగూరిందేమీ లేదు. ఓటరు నాకేంటి అని ఆలోచిస్తున్నాడంటే ఇలాంటి తప్పిదాలే కారణం. ఏ పత్రిక చదవాలో, ఏ టీవీ చూడాలో, ఎవరి మాట నమ్మాలో తెలియక ఓటు అనే ఆయుధంతోనే సమాధానం చెప్పడానికి ఓటరు సన్నద్ధమయ్యాడు. ప్రజాకోర్టు
బోనులో ఈ మీడియా కూడా నిలబడక తప్పలేదు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మీడియా ఉండాలా? మీడియాకు అనుగుణంగా ప్రజలు ఉండాలా అనేది తేల్చుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఓటు అనేక రకాలుగా చీలిపోవడంతో ఫలితం ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. పైగా ఫలితం కోసం అన్ని రోజులు వేచి ఉండాల్సిరావడం ప్రజల సహనానికి పరీక్ష పెట్టడమే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా ఉందని చెప్పడం ఈ కథనం ఉద్ధేశం. జనసేన వల్ల ఏ పార్టీకి నష్టం ? ఎందుకు నష్టం ? అనే అంశాలను మరో పోస్టులో వివరిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here