పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో కేంద్రం కీలక ప్రకటన

1474

పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదని వైసీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జవాబు ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. దీనిపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు తమకు ఎలాంటి నివేదికలు రాలేదని, సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించిందని, విభజనచట్టంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీనికి వంద శాతం నిధులను కేంద్రం భరిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పోలవరంలో 60 శాతం వరకు పనులు పూర్తి అయ్యాయని, ఇంతవరకు జరిగిన ఈ పనులు, పునరావాస కార్యక్రమంలోగానీ, ఇతర ప్యాకేజ్‌ల్లో అవినీతి జరగినట్టు తమకు నివేదిక రాలేదని.. కాబట్టి దీనిపై సీబీఐ విచారణ జరపాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నేత జీవీఎల్ అడిగిన ప్రశ్నకు ఇదే విధంగా గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం చెప్పారు.

పోలవరంకు సంబంధించి సోమవారం రాజ్యసభలో ప్రశ్నల పరంపర కొనసాగింది. వైసీపీ ఎంపీలు, బీజేపీ సభ్యులు జీవిఎల్‌తో పాటు పలువురు సభ్యులు.. పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. నిధుల విడుదల కోసం ఆర్థికశాఖకు అంచనాలను పంపిచకుండా రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ కమిటీ ఆమోదానికి పంపించాల్సిన ఆవశ్యకత ఏమిటని, దీనివలన మరింత కాలయాపన జరిగే అవకాశం ఉందని మరోసారి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎప్పటిలోగా ఈ కమిటీ తన ఆమోదం తెలుపుతుందని నిలదీశారు. ఎప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేస్తుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వీటన్నిటికి ఈ మేరకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here