పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుకు కేంద్రంపై సీఎం ఒత్తిడి తేవాలి – చంద్రబాబు

26

కరోనాతో ప్రజలకు, వ్యాపారులకు ఆదాయం బాగా తగ్గి పీకల్లోతు కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారు. ప్రజల, వ్యాపార సంస్థల కొనుగోలు శక్తి పెంచి ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజలకు అనేక రాయితీలు ఇస్తున్నవి. ప్రజలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందమే అవుతుంది.
కనుక ప్రజల తక్షణ ఉపశమనం కోసం జగన్ ప్రభుత్వం అదనంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను రద్దు చేయాలి. పెంచిన ధరలు తగ్గించమని సీఎం కేంద్రాన్ని కూడా కోరాలి. 2018లో టీడీపీ ప్రభుత్వం మానవతా దృక్పధంతో పెట్రోల్, డీజిల్ పై రూ.2 చొప్పున తగ్గించిన స్థితిని స్ఫూర్తిగా తీసుకుని జగన్ ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలి.
గత రెండు వారాలుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్ర రవాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత 15 రోజుల్లో డీజిల్ రూ.8.88 పైసలు పెరగ్గా.. పెట్రోల్ రూ.7.97 పైసలు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పెట్రోల్ పై రూ.2.76, డీజిల్ పై రూ.3.07 వ్యాట్ భారం వేసి ప్రజలపై అదనపు భారం మోపారు. ఈ పెరుగుదల వల్ల రాష్ట్ర రవాణరంగంపై ఏటా రూ.3893 కోట్ల భారం పడుతోంది. ధరల పెంపుతో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆకాశాన్నింటిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో ధరల పెంపుతో మరింత పెరగనున్నాయి. రైతులు వ్యవసాయ యాంత్రిక పనులు ప్రారంభించే సమయంలో ధరలు పెంచుకుంటూ పోవడం వ్యవసాయ సంక్షోభాన్ని పెంచుతుంది. సామాన్యుడు వినియోగించే ద్విచక్ర వాహనాలు వాడలేని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. డీజిల్ పై పెంచిన వ్యాట్ ను రద్దు చేయాలి. కేంద్రంపై కూడా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే విధంగా తగిన ఒత్తిడి తీసుకురావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here