పసుపు కుంకుమ..అగ్రి గోల్డ్‌ అక్క చెల్లెమ్మలకు అక్కర్లేదా !

88

డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇస్తున్నారు సరే.. అగ్రి గోల్డ్‌ అక్క చెల్లెమ్మలకు అక్కర్లేదా ! వాళ్ల సొమ్ము వాళ్లకిచ్చేందుకు చంద్రబాబు సర్కారుకు చేతులు రావడం లేదు. 4న విజయవాడలో జరిగే ధర్నాలో పాల్గొని తడాఖా చూపించాలని అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ కన్వినర్‌ శింగరాజు వెంకట్రావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బాసట కమిటీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ రూ.5వేల డిపాజిట్లు చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయించినట్లు కుటుంబరావు ప్రకటించారు. అసలు ఇంతవరకు హైకోర్టులో దీనికి సంబంధించి విధి విధానాలు సమర్పించకుండా కాలయాపన చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో 19.5 లక్షల మంది బాధితులున్నారు. రూ.1176 కోట్లు కేటాయిస్తే కనీసం పది లక్షల మందికి న్యాయం జరుగుతుంది. ఈపని చేయకుండా అగ్రిగోల్డ్‌ ఆస్తులను తమ వద్ద పెట్టుకోవడం సబబేనా అని నిలదీశారు. అసలు ఎన్ని ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు.. ఇంకెన్ని బినామీ ఆస్తులున్నాయనేది వెంటనే ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మనోవేదనతో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. బాసట కమిటీ ఒంగోలు నియోజకవర్గ కన్వినర్‌ రొండా అంజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 23 మంది బలవన్మరణాలకు పాల్పడితే కేవలం ఐదుగురికే పరిహారం అందించినట్లు తెలిపారు. మిగతా వాళ్లకు పరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు బినామీ ఆస్తులతో వ్యాపారం చేసుకుంటున్నారంటే.. ప్రభుత్వ పెద్దలు వాళ్లతో లాలూచీ పడినట్లు కాదా అంజిరెడ్డి విమర్శించారు. కమిటీ నాయకులు అద్దంకి హనుమంతరావు మాట్లాడుతూ బాధితుల ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వానికి అమ్ముడుబోయిన తిరుపతిరావులాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని బాధితులకు సూచించారు. వేల కోట్ల ప్రజా ధనాన్ని పసుపు కుంకుమ పేరుతో పొదుపు మహిళలు ఇస్తే ఇచ్చారు.. అగ్రిగోల్డ్‌ మహిళలకు వాళ్ల సొమ్ము ఇవ్వడానికి ముందుకు రావడం లేదు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించకుంటే రానున్న ఎన్నికల్లో నేతలకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బాసట కమిటీ నాయకుడు శ్రీను బాషా మాట్లాడుతూ ఇటీవల మంత్రులు మాట్లాడుతూ వైఎస్‌ హయాంలో అగ్రిగోల్డ్‌ స్కాం జరిగినట్టు చెప్పడం సిగ్గుచేటన్నారు. బాబుగారి హయాంలో ప్రారంభమై తిరిగి ఆయన పాలనలో అది ప్రజలకు శఠగోపం పెట్టిందని గుర్తు చేశారు. పారదర్శకత గురించి వల్లె వేయడం కాదు. సంస్థ ఆస్తులు, వాటి విలువ గురించిన వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మరో నాయకుడు ఎన్‌వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వాప్తంగా ఉన్న బాధితులు విజయవాడ ధర్నాలో పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా సమావేశంలో బాసట కమిటీ నాయకులు జి.జాలయ్య, కె. ప్రసాద్‌, గోవిందరాజులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here