పవన్‌ కళ్యాణ్‌తో ఉండవల్లి అరుణ్ భేటీ


జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌తో మాజీ కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. పవన్ ఏర్పాటుచేయనున్న జేఎఫ్‌సీపై చర్చించారు. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.విభజన హామీల సాధనకు జేఏసీని ఏర్పాటుచేస్తానన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్.. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(జేఎఫ్‌సీ)ని తెరమీదకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణతో చర్చలు జరిపిన పవన్.. తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ అయ్యారు.

కాగా, ఏపీకి నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న లెక్కల్లో నిజానిజాలు తేల్చేందుకు జేఎఫ్‌సి కమిటీ పనిచేయనుంది. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చాలా నిధులు ఇచ్చామని మోదీ సర్కార్ చెబుతోంది.విభజన చట్ట ప్రకారం ఇవ్వాల్సినవేవీ ఇవ్వలేదని, చాలా నిధులు ఎక్కడినుంచి ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. దీంతో కేంద్రం నెరవేరుస్తున్న హామీలేంటి? అందుకోసం ఇచ్చిన నిధులు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు ఎంత? రాష్ట్ర ప్రభుత్వ వాదనలో నిజమెంత? అన్నదానిపై కూలంకశంగా అధ్యయనం చేయడానికి పవన్ శ్రీకారం చుట్టారు.

దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను ఏపీకి ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు.అన్ని రాష్ట్రాలకు సాయం చేసినట్లే చేస్తున్నారు తప్ప.. కొత్తగా కానీ.. చట్టంలో పొందుపరిచిన సాయం కూడా చేయడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చే నిధుల ఖర్చు వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పెడుతున్నామని, కేంద్రం రహస్యంగా ఇచ్చిన నిధులేవీ లేవని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. అయితే కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? ఖర్చు ఎంత? అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని అటు బీజేపీ నేతలు, ఇటు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అసలు నిజానిజాల్ని బహిర్గతం చేయాలని పవన్ సంకల్పించారు. అందులో భాగంగానే జేఎఫ్‌సీ ఏర్పాటుచేయనున్నారు.

ఈ జేఎఫ్‌సీలో ఆర్థికవేత్తలు, నిపుణులు, మాజీ పబ్లిక్ సర్వెంట్స్, విద్యావేత్తలు, స్కాలర్లు, సామాజికవేత్తలను భాగస్వాములుగా చేయాలని పవన్ భావిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా మేథావులంతా ఏకతాటిపైకి వచ్చి.. ఒక్కటై గొంతు వినిపిస్తే కేంద్రం దిగొస్తుందని భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే జేఏసీ ప్రతిపాదనను చేస్తూ.. జేపీ, ఉండవల్లి సహకారం కోరారు. వాస్తవానికి ఉండవల్లిని కలవడం కోసం రాజమహేంద్రవరం వెళ్లడానికి పవన్ సిద్ధపడ్డారు. కానీ తానే పవన్‌ను కలుస్తానని ఉండవల్లి చెప్పడంతో ఇవాళ్టి భేటీపై ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *