రివ్యూ: ‘నిర్మలా కాన్వెంట్’లో టీనేజ్ లవ్ స్టోరీ

236

తారాగణం: రోషన్, శ్రేయా శర్మ, నాగార్జున, సూర్య, అనితా చౌదరి, ఎల్బీ శ్రీరామ్, ఆదిత్య మీనన్, రవిప్రకాష్, సమీర్ తదితరులు
సంగీతం: రోషన్ సాలూరి
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున-నిమ్మగడ్డ ప్రసాద్
దర్శకత్వం: నాగ కోటేశ్వరరావు
రేటింగ్: 3
మంచి అభిరుచిగల నిర్మాత నాగార్జున. కొత్తదనం వున్న కథల్లో నటించడం గానీ… నిర్మాతగా వాటిని తెరమీదకు తీసుకురావడంలో గానీ ఎప్పూడు ముందుంటాడు. అంతేకాదు… కొత్త టాలెంట్ ఎక్కడుందో… వారిని వెతికి పట్టుకుని మరీ ప్రోత్సహిస్తుంటాడు నాగ్. ఈసారి నాగార్జున తన మిత్రుడు హీరో శ్రీకాంత్ తనయుణ్ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. అంతేనా… తను కూడా సినిమాలో ఓ సపోర్టింగ్ క్యారెక్టర్ చేసి… ఈ సినిమాకు విపరీతమైన ప్రచారం తీసుకొచ్చాడు. తని బిజినెస్ పార్ట్ నర్ నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి తెరకెక్కిన ‘నిర్మలా కాన్వెంట్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ కాన్వెంట్ కథా కమామీషు ఏంటో ఓ సారి తెలుసుకుందామా?!

కథ: భూపతి నగరంలో పెద్ద జమిందారుడైన భూపతి రాజు(ఆదిత్య మీనన్)కు 99 ఎకరాల పొలం వుంటుంది. అతని పొలాలకు నీళ్లు రావాలంటే… పైన వున్న ఈరిగాడు(ఎల్బశ్రీరామ్) పొలం దాటుకుని రావాలి. అందుకే ఆ పొలంపై కన్నేస్తాడు భూపతిరాజు. ఎలాగైనా.. దాన్ని దక్కించుకుని తన పంట పొలాలను సస్యశ్యామలం చేయాలనుకుంటాడు. అందుకు ఈరిగాడు అంగీకరించకపోవడంతో అతన్ని తన అనుచరులచేత చంపిస్తాడు. చనిపోతూ… ఆ భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మొద్దని తన కుమారుడు డేవిడ్(సూర్య)కు చెబుతాడు. అయితే డేవిడ్ తనయుడు శ్యామ్యుయొల్ అలియాస్ శ్యామ్(రోషన్)… భూపతిరాజు కుమార్తె శాంతి(శ్రేయాశర్మ)ని ప్రేమిస్తాడు. వీరిద్దరూ నిర్మలా కాన్వెంట్లో క్లాస్ మేట్స్. క్లాసులో తెలివైన కుర్రాడు శ్యామ్. అతణ్ని ఎలాగైనా తన తెలివితో ఓడించాలనే ప్రయత్నంలో శ్యామ్ కు శాంతి దగ్గరవుతుంది. వీరి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. ఇది తెలిసిన భూపతిరాజు.. వారి ప్రేమను నిరాకరిస్తాడు. ఆ ప్రేమను గెలిపించుకోవడానికి శ్యామ్ ఏమి చేశాడన్నదే మిగతా కథ.

కథ..కథనం విశ్లేషణ: ఓ కొత్త కుర్రాడిని వెండితెరకు పరిచయం చేయడానికి ప్రతి డైరెక్టరూ.. ఓ టీనేజ్ లవ్ స్టోరీని ఎంచుకోవడం గత రెండు మూడు దశాబ్దాల నుంచి చూస్తూనే వున్నాం. గతంలో తేజ.. నితిన్ తో జయం, ఉదయ్ కిరణ్ తో నువ్వు-నేను లాంటి స్టోరీలను తెరకెక్కించి హిట్ కొట్టాడు. అవి ఆ కాలానికి తగ్గట్టుగా కనెక్ట్ అయిపోయాయి… బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. వాట్సప్ లు… ఫేస్ బుక్కులు.. ట్విట్టర్ల యుగం. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేనిదే బయట అడుగు పెట్టరు. అలాంటి కాలానికి అనుగుణంగా ఏదైనా స్టోరీ అల్లిక వుండాలి. అప్పుడే కథ.. వాస్తవికతకు దగ్గరగా వుంటుంది. యూత్ వెంటనే కనెక్ట్ అయిపోతారు. ఇది ఎప్పుడో ఓ దశాబ్దం కింద తీసిన తాలూకు సినిమాలను రిఫరెన్స్ గా తీసుకుని తెరకెక్కించినట్టు కనిపిస్తుంది.
హీరో.. హీరోయిన్ల ప్రేమకథ.. మరీ నాసిరకంగా వుంటుంది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ లేని కథ.. కథనంతో బోరింగ్ అనిపిస్తుంది. స్లో నెరేషన్ కారణంగా రెండున్నర గంటల పాటు.. ప్రేక్షకుడు కుర్చీలో కూర్చోవడమే గగనం అనిపిస్తుంది. ఇలాంటి స్టోరీని నాగ్ ఎలా ఫైనలైజ్ చేశాడనిపిస్తుంది. బహుశా… తనకిష్టమైన ‘మీలో కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ కి కనెక్ట్ అయ్యేలా సెకెండాఫ్ వుంటంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుని వుంటాడేమో అనిపిస్తుంది. ‘ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్’ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం చూస్తుంటే.. భవిష్యత్తులో ఇలాంటి సీజన్ కూడా మాటీవీలో రన్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంతకు ముందు మూడు సీజన్లలో గెలుపొందిన వారికి.. మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం వున్నట్టు ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలుస్తోంది.
ఇలాంటి కథలను డీల్ చేయాలనుకున్నప్పుడు కాస్తైనా కొత్తదనం వుండేలా దర్శకుడు స్క్రీన్ ప్లేను రాసుకోవాలి. అప్పుడే ప్రేక్షకుడు కూడా కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు మరీ తెలుగు ప్రేక్షకుడు కొత్తదనం అడుగుతున్నాడు. పాయింట్ కొత్తదైతే చాలు.. బక్సాఫీస్ ను కళకళలాడించేస్తున్నాడు. దాంతో దర్శకులంతా… కాస్త ఇన్నోవేటివ్ స్టోరీస్ ను ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మూస పద్ధతిలో కాకుండా… కాస్తైనా.. ప్రేక్షకుడు రిలీఫ్ అయ్యే.. కథ..కథనం ఇస్తే.. తప్పకుండా సినిమాలు హిట్టవుతాయనడానికి పెళ్లిచూపులు, బిచ్చగాడు లాంటివే ఉదాహరణ. అలా దర్శకులు ఆలోచిస్తే… వాళ్లకు భవిష్యత్తు కూడా వుంటుంది. అంతెందుకు… నాగార్జున ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదల చేసిన సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి సినిమాలు కూడా కొత్తదనంతో కూడుకున్నవి కాబట్టే అవి బాక్సాఫీస్ ను బద్దలుకొట్టాయి.
అలా కాకుండా.. నిర్మలా కాన్వెంట్ లాంటి పాత కాన్సెప్ట్ తో ట్రావెల్ చేస్తే మాత్రం… ఒక్క సినిమాకే పరిమితం కావడం ఖాయం. ఇందులో ఏదైనా చెప్పుకోవాలనుకుంటే… రోషన్.. శ్రేయాశర్మ.. నాగార్జున గురించే మాట్లాడుకోవాలి. మొదటి సినిమా అయినా రోషన్.. శ్రేయాశర్మ పోటీ పడి నటించారు. ఎక్కడా బేషేజాలకు పోకుండా రోషన్ చక్కగా అభినయం చూపాడు. నాగార్జునతో కలిసి నటించిన సీన్స్ కూడా పర్ ఫెక్ట్ గా కుదిరాయి. తను నిర్వహించిన రియాల్టీ షోలో ఏవిధంగా అయితే బుల్లితెరపై జీవించేశాడో… వెండితెరపైనా నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా వుంది. నాగార్జున ఉన్నంతసేపూ కథ ఫాస్ట్ గా ముందుకు వెళ్లిపోతుంది. గేమ్ షో వివరాలు ముందుగానే తెలిసిపోతుంది కాబట్టి క్లైమాక్స్ ఏంటో ముందుగానే ఊహించేయొచ్చు.
రోషన్ తల్లిదండ్రులుగా సూర్య, అనితాచౌదరి మెప్పించారు. విలన్ ఆదిత్య మీనన్ నటన పర్వాలేదు. యాంకర్ సుమ తనయుడు రోషన్ స్నేహితుడిగా బాషా పాత్రలో నటించాడు. ఎల్బీ శ్రీరామ్ కూడా వున్న కొద్దిసేపైనా బాగా నటించాడు. సంగీతం బాగుంది. రెండు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు అన్నపూర్ణ స్టూడియోస్ కి తగ్గట్టుగానే వున్నాయి.

-నాగరాజు చౌదరి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here