నిమజ్జనం ప్రాంతంలో అప్రమత్తంగా ఉండండి; అనంత జిల్లా ఎస్పీ

8

ప్రమాదరహిత వినాయక నిమజ్జనమే మన ధ్యేయమని అనంతపురం జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా అంతటా జరిగే నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా అందరం కృషి చేద్దామన్నారు. వినాయక నిమజ్జనం పురస్కరించుకుని పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టాలో…ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో…ప్రజలు ఎలా సహకరించాలో తెలియజేస్తూ ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన మాటల్లోనే… జిల్లాలో వినాయక చవితి పర్వదినం ఎలా ప్రశాంతంగా ముగిసిందో గణేష్ నిమజ్జనం కూడా అలానే ప్రమాదరహితంగా ముగియాలి. గణేష్ ఉత్సవ కమిటీలు బాధ్యతగా వ్యవహరించి సంబంధిత పోలీసులకు సహకారమందించాలి. గణేష్ శోభా యాత్ర(ఊరేగింపు) కు ఉపయోగించే ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, తదితర వాహనాలు కండీషన్లో ఉండేలా సరి చూసుకోవాలి. భారీ ప్రతిమలు ఊరేగింపు సమయంలో వాహనం నుంచీ కిందకు పడకుండా గట్టి తాడ్లు, వైర్లతో కట్టుకోవాలి. సంబంధిత సబ్ డివిజనల్ పోలీసు అధికారిచే జారీ చేసిన సీరియల్ నంబర్ ను ఊరేగింపు వాహనానికి కనబడేటట్లు అతికించుకోవాలి. ఊరేగింపు వాహనాల్లో పిల్లలు, రోగ గ్రస్థులు ఉండకుండా చూడాలి. పరిమితికి మించి వాహనాల్లో ఎక్కకూడదు. ఎత్తైన వినాయక ప్రతిమలు ఊరేగింపుగా వెళ్లే సమయంలో విద్యుత్ తీగలు తాకే ప్రమాదముందని గమనించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. భారీ లౌడ్ స్పీకర్లు అమర్చుకుని కర్ణభేరి పగిలేలా రణగొణ ధ్వనులు చేయరాదు. ఊరేగింపు యావత్తు భక్తి భావంతో కొనసాగాలి. రాజకీయ ప్రసంగాలు, నినాదాలకు తావివ్వరాదు. టపాసులు, తదితర పేలుడు పదార్థాలు కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రాఫిక్ కు అంతరాయం కల్గకుండా ఊరేగింపు కొనసాగాలి. త్రిబుల్ రైడింగ్ , ర్యాష్ డ్రైవింగ్ , మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారముంది. ఈవిషయంలో ఉత్సవ సమితి నిర్వాహకులతో పాటు పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. నిమజ్జనం చేసే సమయంలో పిల్లలు, వృద్ధులు, మూర్ఛ వ్యాధి గ్రస్తులు లేకుండా చూసుకోవాలి. ఈత వచ్చిన వారు మాత్రమే నిమజ్జనంలో పాల్గొనాలి. రహదారుల అభివృద్ధి పనుల కోసం చెరువులు, కుంటలు, వాగుల్లో ఇసుక, మట్టి తవ్వకాలతో గుంతలు ఏర్పడి ఉంటాయని… ఇటీవల కురిసిన వర్షాలుతో అందులో నీరు చేరి లోతుగా ఉండే ప్రమాదముందన్నారు. నిమజ్జనం సమయంలో భారీ ప్రతిమలు మీద పడే అవకాశాలుంటాయి. వీటిన్నంటినీ గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు కోసం మంటపాల నుంచీ వినాయక ప్రతిమలు వాహనాలపై ఉంచింది మొదలు నిమజ్జనం పూర్తీ అయ్యి అందరూ ఇంటికి చేరే వరకూ ఉత్సవ కమిటీ అప్రమత్తంగా ఉంటూ ప్రశాంత నిర్వహణకు తోడ్పడాలి. వీలైనంత వరకూ వెలుతురులోనే నిమజ్జన కార్యక్రమం ముగిసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన పట్టణాల్లోని ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణకు సి.సి.కెమెరాల సహకారం తీసుకుంటారు. మూడో రోజైన శనివారం జిల్లాలోని పుట్టపర్తి, గుంతకల్లు, ధర్మవరం, కళ్యాణదుర్గం, తదితర పట్టణాలుతో పాటు జిల్లాలోని అన్ని గ్రామాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతుండటంతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నాం. ఐదో రోజైన సోమవారం అనంతపురం, కదిరి, తాడిపత్రి పట్టణాల్లో నిమజ్జనం జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో కూడా భారీ పోలీసు బందోబస్తు చేపట్టనున్నారు. జిల్లాలో చివరగా ఏడో రోజైన బుధవారం హిందూపురంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పక్కా ప్రణాళికతో పోలీసులు బందోబస్తు చర్యలకు ఉపక్రమించనున్నారు. వినాయక ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాల్లో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా…రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నా…ఇబ్బందులు తలెత్తినా వెంటనే ” డయల్ – 100″ కు లేదా ” 9989819191″ నంంబర్ కు కాల్ , వ్యాట్సాప్ ద్వారా సమాచారం పంపండి. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here