రివ్యూ: నవ్వుకుందాం రా

93

తారాగణం: సుశాంత్‌, సోనమ్‌ ప్రీత్‌ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్‌ అబ్బాసి, సుధ, ఆనంద్‌, రమాప్రభ, రజిత, హరీష్‌ తదితరులు
సంగీతం: అనూప్ రెబెన్స్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
ఎడిటింగ్‌: గౌతంరాజు
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
రేటింగ్: 2.75

ప్రస్తుతం పరిస్థితుల్లో సుశాంత్ కి అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. అడ్డా సినిమా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చించి. అయితే మరోసారి హిట్టుకొట్టాలని చాలా కాలం ఎదురు చూసి… ఆటాడుకుందాం రా మూవీ చేశాడు. ప్రయోగాల జోలికి వెళ్లకుండా… కమర్షియల్ ఫార్ములానే నమ్మకుని ఈ సినిమా చేశాడు. ‘ఆడోరకం..ఈ డోరకం’ మూవీతో బాగా నవ్వించిన జి.నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం నవ్వించిందో తెలుసుకుందాం పదండి.

కథ: విజయ రాజారామ్ (మురళీ శర్మ).. ఆనంద్ ప్రసాద్(ఆనంద) ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఆనంద్ ప్రసాద్ ఇచ్చే సలహాలు… సూచనలతో విజయ రాజారామ్ అత్యంత ధనవంతుడవుతాడు. ప్రతి కాంట్రాక్టు పని దక్కించుకుంటూ.. దూసుకుపోతారు. అది సహించలేని శాంతారామ్(విలన్) విజయ రాజారామ్ ను దొంగదెబ్బ తీస్తాడు. దాంతో ఒక్కసారిగా పేదవాడైపోతాడు. దానికి కారణం ఆనంద్ ప్రసాద్ అని.. అతన్నుంచి విడిపోతాడు. ఉన్న ఒక్క రైస్ మిల్లుతోనే కుటుంబాన్ని పోషిస్తూ జీవిస్తుంటాడు. అయితే తన తమ్ముడి కూతరు (రఘుబాబు) పెళ్లికోసం డబ్బులు అవసరమై.. ఉన్న ఒక్క రైస్ మిల్లును అమ్మేయాలనుకుంటాడు విజయ రాజారామ్. అందుకోసం తన తోడబుట్టిన చెల్లి సంతకం కావాల్సి వస్తుంది. ఆమె అన్నమాట కాదని ప్రేమ వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయి వుంటుంది. ఆమె పవర్ ఆఫ్ అటార్నిగా కార్తీక్(సుశాంత్) ఇండియాకొస్తాడు. వచ్చిందే మొదలు.. విజయ రాజారామ్ ఇంట్లోని ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తుంటాడు. అయితే ఇతను రాజారామ్ కి మేనల్లుడే కాదని తెలుస్తుంది. మరి కార్తీక్ ఎవరు? అతను ఇండియాకు రావడానికి కారణం ఏమిటి? అసలు విజయ రాజారామ్ ను మోసం చేసిన విలన్లను ఎలా ఆటకట్టించాడనేది తెరమీద చూడాల్సిందే.

కథ-కథనం విశ్లేషణ: ఇలాంటి కామెడీ ఇంతకు ముందు మనం చూసే వుంటాం. అయితేనేం టేకింగ్లో కొత్తదనం వుండటంతో హాయిగా నవ్వుకునేస్తాం. శ్రీను వైట్ల చేసిన సినిమాల తాలూకు ఛాయలున్న ఈ సినిమా పైసా వసూల్ అని చెప్పొచ్చు. స్టోరీ లైన్ పాతదే అయినా… సుశాంత్ కి తగ్గట్టుగా రాసుకుని తెరకెక్కించారు. ఎలాగూ కామెడీనే ప్రధానం కాబట్టి… తొలి భాగంలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీతో నవ్వులు పండించారు. సీరియల్స్ ని డైరెక్ట్ చేసే దర్శకుడిగా కనిపించి.. కడుపుబ్బ నవ్వించాడు. అతన్ని ఉపయోగించుకుని విలన్ల ఆటకట్టించే ఎపిసోడ్స్ బాగున్నాయి.
ఇక ద్వితీయార్థంలో టైమ్ మిషన్ కామెడీని బ్రహ్మీ బాగా పండించాడు. గతంలో ఎలాగైతే.. దూకుడు, బాద్ షా సినిమాల్లో హీరో బ్రహ్మీని బకరా చేసి.. విలన్ల పని పడతాడో… అలానే ఇందులో కూడా బ్రహ్మానందం ఉపయోగపడ్డాడు. ఇది రొటీన్ కి భిన్నంగా వుందనే చెప్పొచ్చు. సెకెండాఫ్ లో మేజర్ పార్ట్ ఇదే కావడంతో ప్రేక్షకులు కూడా ఎక్కడా విసుగు చెందకుండా హాయిగా నవ్వుకునేస్తారు. ఇక ఎలాగూ మాస్ కి మెచ్చే హీరోయిన్ గ్లామర్… సుశాంత్ యాక్షన్ సీన్స్ వున్నాయి. ఇవన్నీ బి, సి సెంటర్స్ ఆడియన్స్ కి బాగానే ఉపయోగపడతాయనడంలో సందేహం లేదు.
రచయిత శ్రీధర్ సీపాన రాసిన కథను.. దర్శకుడు యాజ్ టీజ్ గా తెరకెక్కించినట్టుంది. ఎందుకంటే.. గతంలో దర్శకుడు తీసిన సినిమాలన్నీ అవుట్ అండ్ అవుట్ కామెడీ. అయితే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా వున్నాయి. యాక్షన్ సీన్స్ భారీగానే వున్నాయి. ఇవన్నీ మాస్ ఆడియన్స్ కోసం రాసుకున్నట్టుంది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం కొంత డ్రా బ్యాక్. అనూప్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఓ రెండు మూడు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సుశాంత్.. సోనమ్ ప్రీత్ ను బాగా చూపించాడు. సినిమా నిడివి రెండు గంటలకే పరిమితం చేసుంటే బాగుండేది. మరో పది నిమిషాలకు కత్తెర వేయొచ్చు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదు. సుశాంత్ మార్కెట్టును మించి పెట్టేశాడు. ఈ సినిమాని ఆడియన్స్ సరదాగా ఓసారి చూసేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here