రివ్యూ: నవ్వించే.. రోజులు మారాయి

78

 

Rojulu-Marayi-Movie-Release-Date-Posters-1
నటీనటులు: పార్వతీశం, చేతన్, తేజస్వి, కృతిక, వాసు ఇంటూరి, ఆలీ తదితరులు
ఛాయాగ్రహణం: బాల్ రెడ్డి
సంగీతం: జె.బి
మాటలు: రవి వర్మ నంబూరి
నిర్మాణం: మారుతి టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కథ-స్క్రీన్: మారుతి
దర్శకత్వం: మురళీకృష్ణ
రేటింగ్: 3/5
కామెడీకి పెట్టించి పేరు మారుతి సినిమా. ఈ రోజుల్లో మూవీతో తన కెరీర్ ను ప్రారంభించిన మారుతి.. మొదట్లో అడల్ట్ కామెడీతో కొన్ని సినిమాలు తీసినా… ఆ తరువాత ప్రేమ కథాచిత్రమ్… భలే భలే మగాడివోయ్ లాంటి క్లీన్ ఎంటర్టైనర్ సినిమాలను తీసి… తన మీద పడ్డ ముద్రను చెరిపేసుకున్నాడు. తాజాగా వెంకటేష్ తో బాబు బంగారం సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే..  మారుతి టాకీస్ బ్యానర్లో చిన్న సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా రోజులు మారాయి చిత్రాన్ని తన బ్యానర్లోనే దిల్ రాజుతో కలిసి నిర్మించాడు. ఈ చిత్రానికి మారుతినే కథ-స్క్రీన్ ప్లే అందించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి రోజులు మారాయి చిత్రం ఏమాత్రం ప్రేక్షకులను నవ్వించిందో చూద్దాం.
కథ: మనసులో వేరే వాళ్లను పెట్టుకుని.. ఇద్దరబ్బాయిల్ని తమ అవసరాల కోసం వాడుకునే ఇద్దరు అమ్మాయిలను ఉద్దేశించి ‘రోజులు మారాయి’ అన్న టైటిల్ తో తెరకెక్కిన సినిమా ఇది. తమ అవసరాల కోసం వాడుకోవడమే కాక.. తమకు పెళ్లవ్వగానే తమ భర్తలు చనిపోతారన్న ఓ స్వామీజీ మాటలు నమ్మేసి.. ఆ ఇద్దరిని భర్తలుగా చేసుకుని వాళ్లను చంపేయాలని చూస్తారు ఈ ఇద్దరమ్మాయిలు. మరి ఆ ఇద్దరు అమాయక అబ్బాయిలు చనిపోతారా? తమను చంపాలనుకున్న ఈ అమ్మాయిలకు ఆ ఇద్దరు యువకులు ఎలాంటి బుద్ధి చెప్పారన్నదే మిగతా కథ.
కథ విశ్లేషణ: ఈ చిత్రానికి కథ.. స్క్రీన్ ప్లే మారుతి అందించాడంటేనే.. మారుతినే ఈ చిత్రాన్ని ముందుండి నడిపించాడనుకున్నారు. తాను స్టార్ డైరెక్టర్ కావడంతో.. ఓ కొత్త డైరెక్టర్ ను అడ్డం పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడులే అనుకున్నారు. ‘రోజులు మారాయి’ చిత్రం చూశాక ఇది నిజమే అనిపిస్తుంది. సినిమా టైటిల్ లో కొంచెం… అమ్మాయిలను ముదుర్లుగా చూపించి.. బోలెడన్ని డబులు మీనింగ్ డైలాగులుంటాయోమొ అనుకుంటారంతా. అయితే ఇందులో అలాంటివేమీ కనిపించవు. అయితే అక్కడక్కడ అమ్మాయిలను మరీ ‘మించిపోయిన’ అమ్మాయిలుగా కొన్ని డైలాగుల ద్వారా చెప్పించాడు తప్పితే.. ఎక్కడా ఒల్గారిటీ లేదు. ‘‘అది మీల్ మేకర్నే కాదురా.. మట్టి ముద్దను కూడా మటన్ అని నమ్మించేస్తది’’ ఈ డైలాగ్ చెప్పేస్తుంది ‘రోజులు మారాయి’ కాన్సెప్ట్ ఏంటన్నది. ఈ తరం అమ్మాయిలు యమ డేంజర్.. అబ్బాయిల్ని నిలువునా వాడేస్తారని చెప్పదలచినట్టుంది ఈ జోనర్. మనసులో వేరే వాళ్లను ఉంచుకుని అవసరాల కోసం వేరే అబ్బాయిలతో తిరిగే విషయంలో అమ్మాయిల పాత్రల్ని మరీ టూమచ్‌గా చూపించాడు. ఎవరో స్వామీజీ చెప్పాడని.. రెండు రోజుల్లోనే ఠకీమని పెళ్లి చేసేసుకోవడం.. ఆ ఇద్దరబ్బాయిలు కూడా అసలే అభ్యంతరం పెట్టకుండా తాళి కట్టేయడం.. మరీ సింపుల్‌గా వాళ్లిద్దరినీ ఆ అమ్మాయిలు చంపేసినట్లు చూపించడం.. అంతా కూడా మరీ డ్రమటిగ్గా.. సినిమాటిగ్గా సాగిపోతుంది. ప్రథమార్ధమంతా ఎక్కడా కథనం ఆగదు. వేగంగా సాగిపోతుంది. పార్వతీశం-తేజస్వి ఇద్దరూ కలిసి ఎంటర్టైన్ చేస్తూ ప్రథమార్ధాన్ని నడిపిస్తారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. మంచి కెమిస్ట్రీ పండింది వీళ్లిద్దరి మధ్య. ప్రథమార్ధం గంట పెద్దగా సమయం తెలియకుండా గడిచిపోతుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం సినిమా గురించి చెప్పడానికేమీ లేదు. హీరోలిద్దరూ చనిపోయినట్లు చూపించగానే.. ఇక తర్వాతి బొమ్మేంటన్నది ఈజీగా అర్థమైపోతుంది. వాళ్లిద్దరూ నిజంగా చనిపోయి ఉండరని ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతుంది. ప్రథమార్ధం చూస్తున్నపుడు ట్రెండీగా అనిపిస్తుంది. ద్వితీయార్థం.. హారర్ కామెడీతో నడిపంచేయడంతో.. రొటీన్ అనే ఫీలింగ్ కలుగుతుంది. నటీనటుల విషయానికొస్తే.. చేతన్-కృతిక జోడీ గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. పార్వతీశం-తేజస్వి జోడీ మాత్రం సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇద్దరూ కూడా చక్కటి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచారు. ‘అమృతం’ ఫేమ్ వాసు ఇంటరూరి కూడా బాగా చేశాడు. జె.బి.సంగీతం.. బాల్ రెడ్డి ఛాయాగ్రహణం బాగున్నాయి. మారుతి తనకు అలవాటైన రీతిలో సింపుల్‌గా ఉండే స్టోరీ స్క్రీన్ ప్లే అందించాడు. దర్శకుడు మురళీకృష్ణ ఇందులో ఏమీ చేయడానికి ట్రై చేయలేదు. మారుతి కథ-స్క్రీన్ ప్లేను ఆన్ సీన్ మీద చూయించాడంతే. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. మాటలు బాగున్నాయి. చివరగా.. రోజులు మారాయి.. నవ్విస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here