దూసుకుపోతున్న తిరుపతి విమానాశ్రయం!


తిరుపతి ఆకాశంలో రెక్కలు కట్టుకుంటోంది. రోజురోజుకూ తన పరపతిని పెంచుకుంటూ విమానయాన రంగంలో దూసుకుపోతోంది. ప్రధాన నగరాలకు మంచి ఆక్యూపెన్సీను సాధిస్తూ… విమానయాన సంస్థలకు అక్షయపాత్రలా కనిపిస్తోంది. పలు ప్రయివేటు విమానయాన సంస్థలు తిరుపతిని తమ తదుపరి వ్యాపార కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. ఆదివారం నుంచి ఇండిగో తన కార్యకలాపాలను ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లకు అనుసంధాన విమాన సర్వీసులను మొదలుపెట్టింది. అతి త్వరలోనే తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
తిరుపతిలో వెలిసిన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తాజాగా రాష్ట్ర విభజన తర్వాత తిరుపతి ప్రాధాన్యం పెరిగి.. ఎడ్యుకేషనల్‌ హబ్‌గా, మెడికల్‌ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. జాతీయ స్థాయి సంస్థలు తిరునగరి చుట్టుపక్కల ఏర్పాటవుతున్నాయి. యాత్రికులు, పర్యాటకులుగా ఏటా రెండున్నర కోట్ల మంది తిరుపతికి వస్తుంటారు. వీరిలో శ్రీవారి దర్శనం కోసం వచ్చేవారు 78 శాతం ఉంటే… ఇతర వ్యవహారాల కోసం వచ్చేవారు 22 శాతమే. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారు ఎక్కువగా హైదరాబాద్‌ నుంచే తిరుపతికి ప్రయాణం చేస్తున్నారు. అక్కడి నుంచే అత్యధిక విమానాలు ఉండటంతో హైదరాబాద్‌ వరకు అనుసంధాన విమానంలో వచ్చి… అక్కడ నుంచి నేరుగా తిరుపతికి వస్తున్నారు. తాజాగా ఈ సౌలభ్యం బెంగళూరు నుంచి కూడా మొదలైంది. బెంగళూరుకు విదేశీ ప్రయాణికుల తాకిడి ఎక్కువ. అయితే ఇప్పటి వరకు బెంగళూరు నుంచి తిరుపతికి విమానం లేదు. దీంతో చాలామంది మరోసారి వచ్చినపుడు స్వామిని దర్శించుకోవచ్చులే అన్న కారణంతో ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు బెంగళూరు నుంచి అనుసంధాన విమానం అతి తక్కువ ధర రూ.1500కే అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది ఈ సంవత్సర గణాంకాల్లో ప్రభావం చూపించవచ్చు.
దాదాపు ప్రధాన నగరాలకు…
రేణిగుంట నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, దిల్లీ, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాతో పాటు ట్రూజెట్‌, ఎయిర్‌కోస్టా, స్పైస్‌జెట్‌లకు తోడుగా ఇప్పుడు ఇండిగో తన సర్వీసులు ప్రారంభించింది. రోజువారీ 13 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక ప్రత్యేక విమానాలు ఉన్నాయి. 1976లో మొదలైన రేణిగుంట విమానాశ్రయ ప్రస్థానం దినదినాభివృద్ధి చెందుతూ ఏటా లక్షల ప్రయాణికులకు అలవాలంగా మారింది. స్పైస్‌జెట్‌ విమానం రోజూ సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట నుంచి బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా ముంబయి చేరుకుంటుంది. ఎయిర్‌ ఇండియా విమానం రోజూ మధ్యాహ్నం 2.20 నిమిషాలకు రేణిగుంట నుంచి హైదరాబాద్‌ మీదుగా దిల్లీ చేరుకుంటుంది. ఇక ఇటీవల వరకు గోవాకు సైతం ట్రూజెట్‌ సర్వీసు నడిపింది. ప్రయాణికుల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో సర్వీసు విరమించింది.

పెరుగుతున్న ప్రయాణికులు
రాష్ట్రంలో విజయవాడ తర్వాత… అత్యంత వేగంగా ప్రయాణికుల మన్ననలు, అభివృధ్ధి చెందుతున్న విమానాశ్రయంగా రేణిగుంట ఉంది. 2014కు ముందు ఏటా లక్ష మంది కూడా దాటని ప్రయాణికుల సంఖ్య ఇటీవల పెరిగింది. సుమారు 60 శాతం వృద్ధి సాధిస్తోంది. తిరుపతికి ఎక్కువ సర్వీసులు రావడంతో పాటు, హైదరాబాద్‌ నుంచి ప్రయాణికుల కోసం మూడు సంస్థలు సర్వీసులు మొదలుపెట్టడం ఇందుకు కారణం. గత మూడేళ్లుగా సాధారణ మధ్యతరగతి వారు విమానయానం వైపు ఆసక్తి చూపుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. రైల్వే టికెట్‌లో దాదాపు సెకండ్‌ ఏసీ ఛార్జిలతో విమాన ప్రయాణం వస్తుండటంతో పాటు… పలు కంపెనీలు పండగలు, వార్షికోత్సవాలకు ఆఫర్లు ప్రకటించడం కలిసొస్తోంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణ సమయం గంటన్నర మాత్రమే కావడంతో కార్పొరేట్‌ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు.
ఆదాయం ఘనం
విమానాశ్రయ ఆదాయం సైతం ఏటేటా పెరుగుతోంది. తాకిడికి అనుగుణంగా ప్రయాణికులను తిరుపతి తీసుకొచ్చేందుకు ప్రయివేటు క్యాబ్‌లను ప్రవేశపెట్టే ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నా వాటికి ఆశించిన ఆదరణ లేదు. దీంతో ప్రయివేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి ఎప్పటి నుంచో కలగా ఉన్న సరకులను తీసుకెళ్లే బోయింగ్‌ విమానాలు సైతం వస్తే ఆదాయం రెట్టింపు అవుతుందని ఎయిర్‌పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం రన్‌వేను విస్తరించే ఆలోచనలున్నాయి. అయితే ఇక్కడి నుంచి ఏ ప్రాంతాలకు ఎగుమతులు ఉంటాయి..? ఎంత మేర ఉంటాయనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

అంతర్జాతీయ సర్వీసులు నడపాలంటే..
తిరుపతిని విమానశ్రాయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా కేంద్రం గుర్తించి దాదాపు రెండున్నర ఏళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు ఒక్క సర్వీసూ ఎగరలేదు. తిరుపతి నుంచి విమాన ఆక్యుపెన్సీ రేటు, అనుసంధాన విమానాల ద్వారా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నవారు ఎంతమంది అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని మాత్రమే ప్రయివేటు సంస్థలు విమానాలు నడుపుతాయి. ఇదే పంథాను ఎయిర్‌ ఇండియా అవలంబిస్తోంది. ప్రయాణికులు లేకుండా విదేశాలకు సర్వీసులు నడపడానికి ముందుకురారు. జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరుతో పాటు రాయాలసీమ జిల్లాల నుంచి గల్ఫ్‌ వెళ్లే కార్మికులు ఎక్కువ. దీంతో రేణిగుంట నుంచి మొదటిగా దుబాయికి సర్వీసును ప్రారంభించాలన్న డిమాండ్‌ ఉంది. శ్రీవారి దర్శనానికి ఏటా రెండు నుంచి అయిదు లక్షల మేర విదేశీయులు వస్తున్నారు. ఈ సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. విదేశీ విమానాలు నడిపే వీలుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *