దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు

870

ఆ విషాధ సంఘటన నా బాల్యం చవిచూసిన తొలి వైపరీత్యం. భయం నీడల నుంచి తెప్పరిల్లి చితికిన బతుకుల చెదిరిన స్వప్నావశేషాలను కళ్లారా చూసిన నాటి దీన పరిస్థితి తలచుకుంటేనే ఒళ్లంతా నేటికీ గగుర్పొడుస్తుంది.

కృష్ణమ్మకు ఇటువైపు దివిసీమకు సమీపంలోనే గుంటూరు జిల్లా వేమూరులో ఉన్న మాకు ప్రాణ నష్టం తక్కువే సంభవించినా., తుపాన్ మిగిల్చిన నష్టం పూడ్చుకోలేనిది. ఆనాటి బీతావహ దృశ్యాలను తర్వాతి కాలంలో చూసిన నాకు అదే అతి పెద్ద భయోత్పాతంగా ముద్రపడిపోయింది. నేటికీ ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. నా పసిమనసు గురుతుంచుకున్న తొలి చేదు జ్ఞాపకాలవి.
దీపావళి పండుగ కోసం అమ్మ చేసిన లడ్డూలు తిని నవంబరు 19 మధ్యాహ్నం పడుకున్న జ్ఞాపకం. ఉరుములు, మెరుపులతో వానజోరు పెరిగి ఉలికులికిపడుతున్నాను. సాయంత్రం కూడా కాలేదు. చిమ్మ చీకటి. ఊళ్లో కరెంటు పోయింది.
మేము నివసిస్తున్న ఇంటి చుట్టూ ఇళ్లు కుప్పకూలాయి. మా ఇంటి పై కప్పు ఒకవైపు ఈదురుగాలికి కొట్టుకుపోవడంతో ఆ హోరు గాలిలోనే మా అమ్మ నన్ను నా సోదరిని సమీపంలోని మరొకరి ఇంటికి సురక్షితంగా చేర్చిన జ్ఞాపకం. చావిడి పడి పశువులు చనిపోతాయని భావించి వాటికి కట్టిన తాళ్లను ఊడదీస్తే అవి పొలాల్లోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకుంటాయని భావించి ఆ సమయలో వెళ్లిన నాన్న ఇంకా రాలేదేమని భయంతో ఎదురు చూసిన క్షణాలవి. ఆ నిద్రలేని రాత్రి ఘడియ ఘడియలో ఒక ప్రళయం తీవ్రత ఇంతగా ఉంటుందని తెలియని వయసు అది.
ఆ కాళరాత్రి 1977 నవంబర్ 19వ తేదీ రాత్రి సముద్రుడు ఉగ్రరూపం దాల్చి గ్రామాలపై విరుచుకుపడ్డాడు. ముందటి రోజున మొదలైన వాన అంత ఉగ్రరూపం దాల్చి గ్రామ గ్రామాలే తుడిచిపెట్టుకుపోతాయని ఎవరూ ఊహించలేదు. నవంబరు 19 పట్టపగలు చీకట్లు కమ్మితే బుడ్డి దీపాల వెలిగించిన నాటి పరిస్థితులు బాగా గురుతు. ఉరుములు మెరుపులతో జోరు వాన పెరిగి పెరిగి అమాంతం మనుషుల్ని సైతం ఎత్తి అవతల పడేసేంత ఈదురుగాలులు మరో వైపు. అలలు తాడి చెట్ల కంటే ఎత్తు స్థాయిలో విరుచుకుపడ్డాయని రేడియోలో చెబుతుంటే విని కంపించిపోయాం. దివిసీమ లో తీర ప్రాంత గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి. సముద్రుడి ప్రళయ గర్జనకు గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. ఎటు చూసినా గుట్టలు గుట్టలుగా పడి ఉన్న మృతదేహాలు,పశువుల కళేబరాలు… నాటి ప్రళయ బీభత్స కన్నీటి కథలను విన్నప్పడల్లా ఆ మారణహోమం తాలూకు విషాదం గుండెలు పిండేస్తుంది. శవాల గుట్టలుగా మారిన పాలకాయతిప్ప, సొర్ల గొంది, చింతకోళ్ల వంటి ఎన్నో గ్రామాల ఆనవాళ్లు కనిపించలేదంటే దివిసీమ తుపాను సృష్టించిన ప్రళయం ఎంతటి తీవ్రమైనదో అర్ధం చేసుకోవచ్చు. దివిసీమ నాయకుడు, ఆ నాటి మంత్రి మండలి వెంకట కృష్ణారావు గారు (మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ గారి తండ్రి) చూపించిన ఔదార్యం, కష్టకాలంలో ప్రజలను ఆదుకున్న తీరు, నిజమైన నాయకత్వ లక్షణం వల్ల ఆనాటి దివిసీమ ప్రజల పాలిట ఆయన దేవుడయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత తీసిన “ఈనాడు” అనే సినిమాలో దివిసీమ తుపాను దృశ్యాలను ఆ సినిమాలోని “రండి కదలరండి” అనే పాట చిత్రీకరణలో చూసినప్పుడే దివిసీమ చీకటి రోజు నాటి బీభత్స కన్నీటి గాధలు నాకు తెలిశాయి. అప్పటి వరకు కేవలం రేడియో ద్వారా మాత్రమే విన్నాను. ఆ సినిమాలో మాత్రమే ప్రత్యక్షంగా చూసి చలించిపోయాను. దివిసీమ ఉప్పెనలో మృతుల దిబ్బలుగా మారిన వందలాది గ్రామాలలో అమరులైన వారు సుమారు 15 వేల మంది. లక్షలాది మంది ప్రజలు పొగిలి పొగిలి ఏడ్చిన ఆ నాటి దయనీయ గాధలను నవంబరు 19 గుర్తు చేస్తున్నప్పుడల్లా నా కళ్లు చెమరుస్తాయి. వారికి శ్రద్దాంజలి ఘటిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here