దారుణం:బిల్లు కట్టలేదని అవయవాలు తీసుకున్న ఆస్పత్రి

104

కార్పోరేట్ ఆస్పత్రుల అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పేషెంట్ మరణించినా బతికే ఉన్నాడని చెప్పి వైద్యం చేస్తున్నట్లు నటించి డబ్బులు గుంజే ఆస్పత్రుల వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం. ఇప్పడు నెల్లూరులో ఓ కార్పోరేట్ ఆస్పత్రి బిల్లు కట్టలేదని అవయవదానం పేరిట శరీరంలోని గుండె, కిడ్నీలు, కళ్ళు, కాజేసింది. అవయవదానం పట్ల అవగాహన లేని మహిళ కార్పోరేట్ ఆస్పత్రి సిబ్బంది చెప్పిన మాటలు నమ్మి, వారిచ్చిన కాగితాల మీద సంతకం పెడితే భర్త శరీరంలోని అవయవాలు కాజేశారు.

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం వడ్డెపు గుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకొల్లు శ్రీనివాసులు అనే వ్యక్తి మోటారు సైకిల్ ఢీ కొట్టడంతో గాయపడ్డాడు. బైక్ తో ఢీ కొట్టిన వ్యక్తి అతడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఖర్చుల కోసం 20 వేల రూపాయలు చెల్లించి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాసులు భార్య అరుణ ఆస్పత్రికి చేరుకుంది.

ప్రమాదంలో ఆమె భర్త బ్రెయిన్ కు దెబ్బతగిలిందని, బ్రెయిన్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ చేసినా బతుకుతాడని గ్యారంటీ ఇవ్వలేమని కూడా చెపుతూ…అప్పటి వరకు చేసిన వైద్యానికి లక్ష రూపాయలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం అడిగింది. అంత డబ్బు తన వద్దలేదని ఆమె ఆస్పత్రి వర్గాలకు చెప్పింది. ఆ తర్వాత… మధ్యాహ్నానికి శ్రీనివాసులు బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు ప్రకటించారు.

అప్పటి దాకా చికిత్సకైన లక్ష రూపాయలు చెల్లించి బాడీని తీసుకెళ్ళమని వైద్యులు తెలిపారు. అంత డబ్బుతనవద్దలేదని నిస్సహయతను వ్యక్తం చేయగా…అయితే భర్త అవయవాలు దానం చేయమని, అది చేస్తే లక్ష రూపాయలు కట్టాల్సిన పనిలేదని, మీ కుటుంబానికి జీవితాంతం ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి, కొన్నికాగితాలు ఇచ్చి ఆమె వద్ద సంతకం తీసుకున్నారు. అనంతరం శ్రీనివాసులు శరీరంలోంచి కళ్లు, కిడ్నీలు, గుండె, తీసుకుని శవాన్ని ఆమెకు అప్పచెప్పారు.

ఆ తర్వాత కానీ ఆమెకు విషయం అర్ధం కాలేదు. భర్త శరీరంలోంచి ప్రధాన భాగాలు తొలగించారని తెలిసి బాధ పడింది. దీంతో ఆమె జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక కలెక్టర్ కు అందచేసారు. చంద్రన్న బీమా పధకం ద్వారా ఆమెకు సహయం అందిస్తూ, తెల్లరేషన్ కార్డును మంజూరు చేసి, ఆమె పిల్లలకు విద్య విషయంలో సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here