దశ ‘దిశ’లా ప్ర‌శంస‌లు..!!!

40

జయహో జగన్ అంటూ నారీలోకం నీరాజనాలు
ఆపదలో ఉన్న మహిళల రక్షణ కోసం AP ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ వినియోగదారుల ప్రశంసలు పొందుతోంది. ఈ నెల 9న ప్లేస్టోర్‌లో ఆండ్రాయిడ్, IOS లలో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను 13 సాయంత్రం 4 గంటల వరకు వరకు అంటే.. మూడు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషం. అదేవిధంగా యాప్‌ సేవలను మెచ్చి గూగుల్‌ ప్లేస్టోర్‌లో 5 కి ఏకంగా 4.9 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఈ నెల 8న రాజమహేంద్రవరంలో దిశ పోలీస్‌స్టేషన్‌తోపాటు దిశ మొబైల్‌ అప్లికేషన్‌ (యాప్‌)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మొద‌టి కేసు..
-6 నిమిషాల్లో వేధించిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
– 24 గంటల్లో ఛార్జ్ షీట్.
ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు.ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్‌ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగంలో ప‌ని చేస్తారు. ఆయ‌న కూడా ఇదే బ‌స్సులో ప్ర‌యాణించారు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు.
ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా ప్రారంభించిన దిశ యాప్‌ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు.యాప్‌లోని SOS(Save our Source) బటన్‌ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్‌ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్‌ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు.
24 గంట‌ల్లోనే ఛార్జిషీట్‌..
ప్రొఫెస‌ర్ బ‌స‌వ‌య్య‌పై కేసు న‌మోదు చేసిన 24 గంట‌ల్లోనే ఛార్జిషీటు కూడా దాఖ‌లు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు రూర‌ల్ స‌ర్కిల్ పోలీసులు బుధ‌వారం ఎక్సైజ్ కోర్టులో దాఖ‌లు చేశారు.
దిశ ప‌ని చేస్తుందిలా..!!!
ఆండ్రాయిడ్, IOS మొబైల్‌ ఫోనుల్లో ప్లేస్టోర్‌లోకి వెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికే ఇంటర్నెట్‌ అవసరం. తర్వాత ఇంటర్నెట్‌ ఉన్నా, లేకున్నా మొబైల్‌ ద్వారా యాప్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఆపదలో ఉన్నవారు ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి అత్యవసర సహాయం (SOS) బటన్‌ నొక్కితే చాలు.. వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి.ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసే సమయం లేనప్పుడు చేతిలోనిఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్‌ రూమ్‌కు సమాచారం చేరుతుంది. ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్‌ రూమ్‌కు పంపించే వీలు ఉంది. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్‌ రక్షక్‌ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్‌ వెళ్తుంది.ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్‌ అమర్చిన పోలీస్‌ రక్షక్‌ వాహనాల్లోని ‘మొబైల్‌ డేటా టెర్మినల్‌’ సహాయపడుతుంది.ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్‌ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్‌)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.
దిశ యాప్‌లోని ‘ట్రాక్‌ మై ట్రావెల్‌’ ఆప్షన్‌ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు.
ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. ఈ యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్‌ 100 అయితే నేరుగా కాల్‌ చేసి విషయం చెప్పాలి. డయల్‌ 112 అయితే మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా సరిపోతుంది.
దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి.వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here