త్వరలో మై యాప్, యాప్‌స్టోర్, ఇ-హైవే ప్రారంభం!

33

రాష్ట్రంలో తక్షణ పరిష్కారం అవసరమైన అత్యవసర సమస్యలను రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగం తన దృష్టికి తేవాలని, ఏఏ ప్రాంతాలలో ఏఏ సమస్యలు వెనువెంటనే పరిష్కారానికి ఎదురు చూస్తున్నాయో తనకి తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమస్య తీవ్రతను అనుసరించి తనకు తెలియపర్చాలని కోరారు. సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగంలో ఇ-ప్రగతి సంస్కరణల పురోగతిని ఆయన సమీక్షించారు. ఎవరో వచ్చి సూచించడం కాదని, మనకు మనమే ఇందులో ముందుకెళ్లి ప్రజలలో పరిపాలనపై సంతృప్తి శాతాన్ని పెంచాల్సి ఉందన్నారు.

ఆర్టీజీ లాంటి వ్యవస్థ పనిచేస్తున్నా ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టడంలో వెనుకబడి ఉండకూడదని, ఒంటిమిట్టలో ప్రమాదం మానవ వైఫల్యమేనని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి జిల్లా నుంచి తక్షణ పరిష్కారం కోసం మూడు విభాగాలుగా హాట్ కాల్స్‌ను విశ్లేషించాలన్నారు. విపత్తుల నివారణలో గతానికి సంబంధించి చారిత్రక సమాచారాన్ని ఉపయోగించుకుని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చన్నారు. వేసవిలో వడగాడ్పులతో వడదెబ్బ తగులుతుందని, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రాధాన్యత నివ్వాలన్నారు.మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, వచ్చే రెండు నెలల్లో వేసవి తీవ్రత ఉంటుందని, విపత్తుల నివారణ విభాగం అప్రమత్తంగా ఉండాలని, నిధుల గురించి ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు.
‘ఇది సమీక్ష కాదు. అప్రమత్తం చేయడానికి, ముందుస్తు చర్యలు తీసుకోవడానికి ఉద్దేశించిన సమావేశం’ అని ముఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో రైతులు సత్ఫలితాలు సాధించేందుకు తాను 16,000 మంది అధికారులతో 300 సమావేశాలు నిర్వహించానని ముఖ్యమంత్రి అన్నారు. జీవించడానికి మనిషికి ఆహారం ఒక్కటే సరిపోదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎంతో అవశ్యమన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పరిపూర్ణత వస్తుందని చెప్పారు.
మై యాప్ (Myapp), App Store, eHighways ఈ నెల 4 వ తేదీన ఆవిష్కరించడానికి సిద్ధం చేశామని, ఈ నెల 27న లైసెన్స్ మెనేజ్‌మెంట్ సిస్టం&సర్టిఫికెట్ లెస్ గవర్నమెంట్ సిస్టంను ప్రారంభించవచ్చని అధికారులు ముఖ్యమంత్రికి సూచించారు. మై యాప్ పోర్టల్ అనే సింగిల్ పాయింట్ పోర్టల్. ఆరోగ్యం, పొలం, ఉద్యోగం, నగరం, భద్రత, ప్రయాణం, గ్రామం, ప్రభుత్వ పథకాల లబ్ది, చెల్లింపులకు సంబంధించి సకల సమాచారం నిక్షిప్తమైన సింగిల్ పాయింట్ పోర్టల్ అని, మన పీసీలలో, మొబైల్ ఫోన్లలో కూడా ప్రవేశపెట్టి వినియోగదారు వ్యక్తిగతంగా ఉపయోగించుకోవచ్చని అధికారులు వివరించారు.
ఓటరు సమాచారం, రేషన్ కార్డు, జనన, మరణ సర్టిఫికెట్లు తదితర అంశాల్లో ఇ-సేవ సమాచారాన్ని సమీకృతం చేయాలని నిశ్చయించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే నెలాఖరుకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జూన్ నాటికి విద్యకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్నిఅప్‌డేట్ చేయాలన్నారు. త్వరలో ఆవిష్కరించనున్న యాప్స్‌లో, పోర్టల్స్ లో తెలుగు తర్వాత, ఆంగ్లానికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఇ-ప్రగతిపై ఇక నుంచి నెలవారీ క్యాలెండర్ ప్రవేశ పెట్టాలని ఆదేశించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ తో ప్రతి ప్రభుత్వ విభాగం అనుసంధానమై సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశించారు. మై ఏపీ పోర్టల్ పేరును ‘ఇ-ప్రగతి’గా మార్చాలని, ప్రజలకు సంబంధించి కొత్త ట్యాగ్ లైన్ చేర్చాలని ముఖ్యమంత్రి కోరారు. మై ఏపీ, యాప్ స్టోర్, ఇ-హైవే లాంటి ఎన్ని అనుబంధ పోర్టల్స్ ఉన్నా వీటన్నింటికీ ‘ఇ-ప్రగతి’ ప్రధాన పోర్టల్‌గా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సింగిల్ సోర్స్ ద్వారా సమాచారాన్ని సమీకృతం చేయాలన్నారు. ప్రతి ఒక్క అంశానికి సంబంధించి సమాచారం, విశ్లేషణలో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. గేట్ వేస్ లో ఓవర్‌లాపింగ్స్ ఉండకూడదని, యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. డేటాను పోర్టల్ లో అప్‌డేట్ చేసే విధానం ఆటో-అప్‌డేషన్ గా ఉండాలన్నారు. వినియోగదారు లాగిన్ అయిన ప్రతిసారీ తాజా సమాచారం కోసం ఇబ్బందిపడకూడదని చెప్పారు. విద్యకు సంబంధించి అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ల సమాచారాన్ని పాఠశాలలు మే నెలలోగా పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జన్మభూమి పోర్టల్ (https://janmabhumi.ap.gov.in) ఉపయోగించాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here