తెదేపాకు ఓటేశారని ..ఊళ్లోకి రావద్దట !

91

తెదేపాకు ఓటేసినందున ఐదేళ్లపాటు ఊళ్లోకి రాకూడదని వైకాపా నాయకులు తమను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు శనివారం రూరల్ ఎస్పీ జయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. తక్షణం తమకు రక్షణ కల్పించాలని కోరారు. తమపై దాడులు చేస్తున్న 26 మంది పేర్లు, వివరాలు అందజేశారు. స్పందించిన ఎస్పీ విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలి ఎన్నికల్లో తెదేపాకు ఓటు వేశామని వైకాపాకు చెందిన నాయకులు తమను రాళ్లు, కర్రలతో కొట్టి, ఊరిలో ఉండవద్దంటూ బెదిరించి వెళ్లగొట్టారని పేర్కొన్నారు. దాడులు భరించలేక 70 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టి పొరుగునున్న గామాలపాడులో తలదాచుకుంటున్నట్లు వారు తెలిపారు. వ్యవసాయమే తమకు జీవనాధారమని, పొలాల్లోకి వెళుతుంటే మరో ఐదేళ్ల వరకు గ్రామంలోకి రాకూడదని.. ఎదిరించి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. వారిలో కొందరు రౌడీషీటర్లు చేరి గ్రామంలోని 20 మందిపై దాడిచేశారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం లేదని వాపోయారు. సుమారు 200 కుటుంబాలు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రస్తావించారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినవారిలో చింతపల్లి జానీబాషా, అల్లాభక్షు, సైదా, గౌస్ తోపాటు పిన్నెల్లికి చెందిన 50మంది రైతులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here