డేటా పేరుతో దాడులు చేస్తే ఊరుకోం:చంద్రబాబు

48

డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించిన ఆయన డేటా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కై తెదేపాను దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయమని, అందులో తలదూర్చితే మూలాలు కదులుతాయని హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. వైకాపాకు చెందిన కొందరు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై దాడి చేస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉన్న పోలీసులు కాపాడతారట అంటూ ఎద్దేవాచేశారు. ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా అని సీఎం ప్రశ్నించారు. మదనపల్లె గ్రామీణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ వద్ద హంద్రీ-నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు ముఖ్యమంత్రి సోమవారం జలహారతిఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు. అంతకుముందు చిప్పిలి సమీపంలో విజయ పాల డెయిరీ, సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.24కోట్ల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్‌ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు.

రెండు కోట్ల ఎకరాలకు నీళ్లు
మదనపల్లెలో చిప్పిలి చెరువు నీళ్లు వదలడం అద్భుతమని సీఎం వ్యాఖ్యానించారు. మదనపల్లెకు నీటి కొరత లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి సదుపాయం లేక వలసలు పోయే పరిస్థితి ఉండేదని, అలాంటి స్థితి నుంచి ఇవాళ నిలదొక్కుకునే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. ‘‘నదుల అనుసంధానం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డా. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని చెప్పి.. ఇచ్చిన మాట ప్రకారం నీళ్లిచ్చా. రెండు కోట్ల ఎకరాలకు నీళ్లివ్వాలన్నదే నా లక్ష్యం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అన్ని వర్గాలను అదుకున్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ గెలిపించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here