జూలై 8న టీడీపీకి గుడ్ బై చెప్పనున్న ఆనం?

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. వైసీపీలోకి ఆయన చేరేందుకు రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. జూలై 8న దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో రామనారాయణను కొనసాగించేందుకు టీడీపీ నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించలేదు. గత రెండు, మూడు రోజులుగా అభిమానులు, సన్నిహితులతో ఆయన సమావేశాలు నిర్వహించారు. పార్టీ మారాలనుకోవడానికి కారణాలు వివరిస్తూ, వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు.

వాస్తవానికి పార్టీ మారాలనే నిర్ణయాన్ని కొన్ని నెలల ముందే రామనారాయణ రెడ్డి తీసుకున్నారు. టీడీపీలో చేరే సమయంలో చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. మినీ మహానాడు వేదికలపై కూడా టీడీపీని, పార్టీ విధానాలను ఆయన బహిరంగంగా విమర్శించారు. ఈ నెల 2న నెల్లూరులో జరిగిన నయవంచన దీక్ష వేదికపైనే ఆయన వైసీపీకి సంఘీభావం ప్రకటించాల్సి ఉంది. అయితే, రోజులు బాగాలేవని ఆ కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేసుకున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *