జాతకాలు ఎన్నికల ఫలితాలు చెబుతాయా?

122

ఎన్నికల విషయంలో సెఫాలజీ ప్రకారం జరుగుతున్న సర్వేలకూ, జ్యోతిషం ప్రకారం చెప్పే ఫలితాలకూ పెద్దగా తేడా ఏమీ లేదు. ఎందుకంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఎన్ని జాతకాలు ఉంటున్నాయో, వైసీపీ అనుకూలంగా కూడా అన్ని జాతకాలు ఉంటున్నాయి. ప్రతిధ్వని సినిమా అనుకుంటాను పరుచూరి గోపాలకృష్ణ అవకాశవాద రాజకీయనాయకుడిలా డైలాగులుంటాయి. ‘అలా జరిగితే ఇలా రాయి, ఇలా జరిగితే అలా రాయి’ అని శాసిస్తుంటాడు. అచ్చు అలాగే ఈ జ్యోతిష ఫలితాలు ఉంటున్నాయి. ఫలితాలు వచ్చాక తాము చెప్పినట్లు
జరిగితే క్యాష్ చేసుకోవడానికి ఈ ఫలితాలు ఉపయోగపడవచ్చు. లేదా ఇప్పుడే క్యాష్ చేసుకోవడానికైనా ఈ ఫలితాలు చెబుతుండవచ్చు. ‘నువ్వు కూడా జాతకాలు చెబుతుంటావు కదా… గతంలో నువ్వు చెప్పినట్టే జరిగాయి కదా. ఈసారి ఫలితల గురించి జర్నలిస్టులా కాకుండా జ్యోతిషంతో విశ్లేషించు’అని నన్ను అడిగిన వారు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసినంతవరకు నూటికి నూరు శాతం ఫలితాలను ఏ జ్యోతిష్కుడూ చెప్పలేడు. అలా చెప్పే జ్యోతిష్కులు ఇలాంటి మానవ సమాజంలో ఉండలేరు. ఎంత గొప్ప జ్యోతిష్కుడైనా 60 నుంచి 70 శాతం ఫలితాలను మాత్రమే చెప్పగలడు. మిగతాదంతా దైవాధీనం. కర్ణాటక రాష్ర్టంలో కూడా ఇబ్బడిముబ్బడిగా జ్యోతిషం చెప్పేశారు. ఫలితాలు వచ్చాక తాము చెప్పిన జ్యోతిషం తప్పవడంతో ఆ వీడియోలను తీసేశారు. థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ లాగా ఫలితాలు ఉంటాయి. ఇంకో విషయం ఏమిటంటే కొందరు జ్యోతిష్కులు ఎన్ని సీట్లు వస్తాయో కూడా లెక్కలు వేసి మరీ చెప్పేస్తున్నారు. అది ఎలా లెక్క కట్టాలో ఏ శాస్ర్తంలోనూ లెక్క కట్టలేదు. గత తెలంగాణ ఎన్నికల్లో నేను కూడా కొంతమంది మిత్రుల దగ్గర ఫలితాలు చెప్పాను. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారని, ఉత్తమకుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి జాతకాలు బాగుండలేదని చెప్పాను. అయితే కేసీఆర్ కు అన్ని సీట్లు వస్తాయని నేను కూడా అంచనా వేయలేదు. కేసీఆర్, కేటీఆర్ కన్నా కవిత జాతకం బాగుందని కూడా చెప్పాను. నాకున్న అవగాహన మేరకు ఏపీ ఎన్నికలపై నా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను. ఈనాడులో పనిచేసే మిత్రులు 2014లో ఎన్నికల ఫలితాల గురించి అడిగినప్పుడు జగన్ ఇప్పుడు అధికారంలోకి రావడం కష్టమని, 2019లో అధికారంలోకి రావచ్చని చెప్పాను. మళ్లీ అదే మిత్రులు ఇప్పుడు అడిగితే జగన్ జాతకంలో బాగోలేదని చెప్పాను. ‘అదెలా… 2014లో మీరే జగన్ కు అనుకూలంగా ఉంటుందని చెప్పారుగా’ అన్నారు. అప్పటికీ ఇప్పటికీ జగన్ జాతకం మెరుగైందని, అధికారంలోకి రావడానికి గోచార గ్రహస్థితులు అనుకూలించడం లేదని చెప్పాను. ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఏడాదిన్నరపాటు విపత్కరం పరిస్థితి ఉంటుందని చెప్పాను. ఇంకో మిత్రుడు ఫోన్ చేసి జగన్ పరిహార ప్రక్రియలు చాలా చేశారని, ఫలితం ఎలా ఉంటుందని అడిగాడు. ‘అటుపక్క చంద్రబాబు కూడా చేశారు కదా’ అన్నాను.
ఇదీ నా విశ్లేషణ
ఏపీ విషయానికి వచ్చే సరికి నాయకులు పుట్టిన తేదీల విషయంలో సందిగ్ధత నెలకొంది. డిసెంబరు 21, 1972లో జగన్ పుట్టినట్లు చెబుతున్నారు. టైము తెలియదు. అలాగే చంద్రబాబు 20 ఏప్రిల్ 1950 అని చెబుతున్నారు. కొన్ని చోట్ల 1951 అని సంవత్సరం ఉంది. అలాగే చంద్రబాబు పుట్టిన తేదీ ఏప్రిల్ 27 అని కూడా ఇంటర్ నెట్ లో ఉంది. అయితే నిన్ననే చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు కాబట్టి 20 ఏప్రిల్ 1950నే పరిగణనలోకి తీసుకుని ఫలితాన్ని విశ్లేషిద్దాం. నేను భృగునాడీ, పరాశర పద్ధతి రెండింటినీ కలిపి జాతకాలను అంచనా వేసే ప్రయత్నం చేస్తాను.
జాగన్ జాతకం
– జగన్ కు గజకేసరి యోగం ఉన్నా అది బలహీనంగా ఉంది.
– జగన్ జాతకంలో ప్రధాన ప్రతిబంధకం గురుచండాల యోగం. గురువు, రాహువు కలిసి ఉంటే గురుచండాల యోగంగా చెబుతారు. ఈ యోగం ఉన్నవారికి రాహుకేతు గోచారంలో చాలా ఇబ్బందులు ఉంటాయి.
– జగన్ జాతకంలో శని మహాదశ ముగింపులో ఉంది. బుధ మహాదశ ప్రారంభం కాబోతోంది. ఇక్కడ బుధుడు ఉన్న స్థానం బలహీనమైంది. శత్రుస్థానంలో ఉన్నాడు. కన్యా లగ్నానికి ఈ దశ యోగించదు.
– కేతు గోచారం జాతక గురు, రాహువుల మీద ఉంది. మార్చి 7న కేతువు ధనస్సులోకి వచ్చాడు. ఇదే రాశిలో జాతక గురు, రాహువులు ఉన్నాయి. కేతువు ఈ రాశిలో ఏడాదిన్నర పాటు ఉంటాడు. ఇది జగన్ జాతకంలో
మైనస్.
– గోచార గురువు అసలు స్థానం వృశ్చికం. కానీ అతిచారం కారణంగా మార్చి 30న గురువు ధనుస్సులోకి వచ్చాడు. ఇది ఈ నెల నాలుగోవారం వరకు ఉంటుంది. ఇది ఒక రకంగా జగన్ కు ప్లస్. అయితే గురువు ఉన్నది కేతు నక్షత్రంలో కాబట్టి బలంగా చెప్పలేం.
– ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి గురువు వృశ్చికంలోకి వచ్చేస్తాడు. జగన్ జాతక గురువుకు బలాన్ని కొంతవరకు మాత్రమే ఇవ్వగలడు. చంద్రబాబు జాతకం
– చంద్రబాబు జాతకంలో బలమైన యోగాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా గజకేసరి యోగం. చంద్రుడు ఉచ్ఛలో ఉండటం వల ఇది బలమైన జాతకంగా మారింది.
– అలాగే రవి ఉచ్ఛలో ఉండి బుధుడితో ఉండటంవల్ల మరో బలమైన బుధాధిత్య యోగం ఏర్పడింది. చంద్రబాబుకూ శని మహాదశ ముగింపు లోనే ఉంది. కాకపోతే వృషభ రాశివారికి శని యోగకారకుడు కాబట్టి ఆయనకు ఈ దశ బాగా యోగించింది. 2021లో బుధ మహాదశ ప్రారంభం కాబోతోంది. దాంతో మరో బలమైన యోగం ప్రారంభం అవుతున్నట్లే.
– జగన్ ను గోచార కేతువు ఇబ్బంది పెడుతున్నట్లుగా చంద్రబాబును గోచార గురువు ఇబ్బంది పెడుతున్నాడు.
– జగన్ చక్రంలోని జాతక శనిని కేతువు ఇబ్బంది పెడుతున్నట్లుగానే చంద్రబాబు జాతక శనిని గోచార కేతువు
ఇబ్బంది పెడుతున్నాడు. ఇది బాబుకు మైనస్సే.
ఫలితం ఎలా ఉంటుంది?
– చంద్రబాబుకూ జగన్ కూ ఏడాదిన్నరపాటు వ్యక్తిగత జాతకంలో ఇబ్బందులు తప్పవు.
– జాతక చక్రాలలో బాబుదే బలమైనదని నా అభిప్రాయం. పైగా శని మహాదశ బాబుకే యోగిస్తుంది. అందువల్ల అధికార పీఠం బాబుకే దక్కవచ్చన్నది నా అంచనా. ఈ విషయంలో నా అంచనా తప్పుకావచ్చు కూడా. దీన్ని
నమ్మి బెట్టింగుల జోలికి వెళ్లవద్దు.
– జగన్ అధికారంలోకి వస్తే మాత్రం మధ్యంతర ఎన్నికలు తప్పకపోవచ్చు.
– ఏడాదిన్నరపాటు కేతు గోచారం బాబుకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటే 2021 లేదా 2022 నుంచి చంద్రబాబు జాతకం మళ్లీ వెలిగిపోతుంది.
నోట్ : ఇందులో జగన్ , చంద్రబాబు పుట్టిన సమయాలు సరిగా తెలియలేదు. నాకు తెలిసినంతవరకు సవరించుకుని విశ్లేషణ చేశాను. పవన్ పుట్టిన తేదీ, సంవత్సరం నాకు సరిగా తెలియకపోవడం వల్ల ఆయన జాతకాన్ని విశ్లేషించలేకపోయాను.

—-సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here