జగన్నాటకాన్ని తలపిస్తున్న జగన్‌ ప్రభుత్వం!

148

వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేతలకు పొంతనే లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలకు ఎక్కడా పోలిక లేదని, జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని అమలు చేసే విధానం సామాన్యులకు ఏమాత్రం అంతుపట్టకుండా జగన్నాటకాన్ని తలపిస్తోందని  మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఎద్దేవా చేశారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6వేలతో కలుపుకొని రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం రూ.12,500లు చెల్లిస్తుందా? విడిగా రూ.12,500 చెల్లిస్తారా? లేక మా ప్రభుత్వ (టీడీపీ) హయాంలో రూ.4 వేలు ఇప్పటికే చెల్లించడం జరిగింది కాబట్టి వాటిని మినహాయించుకొని మిగిలిన సొమ్ము రైతులకు అందిస్తారా? అన్న ప్రశ్నపై జగన్మోహన్‌రెడ్డి దగ్గర నుంచిగానీ, ఆపార్టీవారి దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు కేంద్రప్రభుత్వం అందించే రూ.6 వేలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో 6,500 రూపాయలు ఇచ్చే విధంగా నోట్‌ పుటప్‌ చేశారని తెలుస్తోందన్నారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రైతుల పేరిట అసత్య పాలనతో ప్రజలను మభ్యపెడుతున్నారని, రాజన్న రైతు రాజ్యం తీసుకొస్తామని చెప్పిన జగన్‌ కేవలం పేపర్ల ప్రకటనలకే పరిమితమయ్యారని, రైతులకు లబ్ది కలిగే ఏ ఒక్క నిర్దిష్టమైన హామీని నిన్నటి సభలో జగన్‌ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోగా కేంద్ర సహాయాన్ని అడ్డుపెట్టుకొని మేం రైతులకు భారీగా లబ్ది చేకూరుస్తున్నామని ప్రకటనలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు భరోసా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలని చెప్పి అనంతరం ప్రైవేటు కార్యక్రమంలా మార్చుకొని ఆయా నియోజకవర్గాల్లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయటం హేయమైన చర్య అన్నారు. దళిత ఎమ్మెల్యేలపై వైసీపీ కార్యకర్తల దాడులను ఖండిస్తున్నామన్నారు.

టీడీపీ ప్రభుత్వం రూ.200 పింఛన్‌ను రూ.2,000లు చేయటం జరిగిందని, కానీ జగన్‌ మాత్రం రూ.250లు పెంచి రూ.2,500లు నేనే ఇస్తున్నానని చెప్పుకోవటం వింతగా ఉందన్నారు. ఆనాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 125 రూపాయలు పింఛన్‌ పెంచితే ఈనాడు ఆయన కుమారుడైన జగన్‌ రూ.250లు పెంచి పేదవాడి అభివృద్ధికి పాటుపడుతున్నామని ప్రకటించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.250లు పెంచి భారీ ప్రకటనలు ఇచ్చుకుంటున్న వైసీపీ రూ.1,800 వరకు పింఛన్లు పెంచిన టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించటం ఆక్షేపణీయమన్నారు. జగన్‌ అమలు చేసిన పింఛన్‌ విధానంతో రాష్ట్రంలోని ప్రతి వృద్ధుడు సరాసరి రూ.18,000ల వరకు నష్టపోయారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఆపివేయడమే కాకుండా మరింత తక్కువ లబ్ది కలిగించేలా సంక్షేమ పథకాలు అమలు చేయటం బాధాకరమన్నారు. జగన్‌ ప్రభుత్వం ఆదర్శాలు చెబుతున్నంతగా ఆచరణలో కనబడటంలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, లేని అవినీతిని తెలుగుదేశం పార్టీపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అభివృద్ధి గురించి ఆలోచించకుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది?

ప్రజల్ని మోసం చేయటమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని, అభివృద్ధిని పూర్తిగా ఆపేయడంతోపాటు… జగన్‌ ఇటీవల మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కంటే గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీయడమే ముఖ్యమని మాట్లాడటం చూస్తుంటే జగన్‌కు రాష్ట్రం పట్ల ఏ విధమైన అవగాహన ఉందో ఇక్కడే స్పష్టమౌతోందన్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా ఉందే తప్ప ఓట్లేసి గెలిపించిన ప్రజలు న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశాన కనిపించడంలేదని ఆలపాటి రాజా దుయ్యబట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి లాంటి వ్యక్తే అభివృద్ధిని పక్కన పెట్టేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి? ఉపాధి కల్పన ఏ విధంగా జరుగుతుంది? రాష్ట్రానికి రాబడి ఏ విధంగా వస్తుంది, ప్రజలకు సంక్షేమాన్ని ఏవిదంగా అందిస్తారు? అని కనీస సూత్రాలు కూడా జగన్‌కు తెలియకపోవడం శోచనీయమన్నారు. అభివృద్ధి కంటే ముందు అవినీతిని వెలికి తీయండని అధికారులను ఒక ముఖ్యమంత్రి అడగటం, గత ప్రభుత్వ అవినీతిని నిరూపించినవారికి తగిన బహుమతులు ఇస్తామని చెప్పినవారిని చరిత్రలో తాము ఎక్కడా చూడలేదన్నారు.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here