జగనొస్తే సస్యశ్యామలం.. బాబొస్తే నిత్య కరవు !

177

ఇప్పటికే ఐదేళ్ల నుంచి కరవుతో అల్లాడుతున్నాం ! మళ్లీ చంద్రబాబు వస్తే నిత్యం కరవే ! జగన్‌ అధికారానికి వస్తేనే సస్యశ్యామలమవుతుంది. ఓటమి భయంతో చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నారని మాజీమంత్రి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక 30వ డివిజన్‌లోని గద్దలగుంటపాలెం, ఎస్సీ కాలనీ, మామిడిపాలెం, సీతారాంపురంలో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా బాలినేని మాట్లాడుతూ జగన్‌ అధికారానికి వస్తే అరాచకమంటూ చంద్రబాబు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఒక చేత్తో పోలీసులను, మరో చేత్తో అధికార యంత్రాంగాన్ని గుప్పెట పట్టుకొని ఐదేళ్ల నుంచి చంద్రబాబు చేసిన అరాచకం ప్రజలకు తెలుసని చెప్పారు. సామాన్య ప్రజలను గాలికొదిలేశారు. విపక్షాలను తొక్కేశారు. పచ్చచొక్కాలకు దోచిపెట్టారు. నిలదీసిన వాళ్లపై దాడులు.. కేసులతో బెదిరించారు. ఇంతకన్నా అరాచక పాలన ఎక్కడైనా ఉంటుందా అని బాలినేని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. జగన్‌ అధికారానికి వస్తే రాజన్న, ఎన్టీఆర్‌ కన్నా మెరుగైన పాలన అందిస్తారని చెప్పారు. రాష్ట్రమంతా సుభిక్షంగా వర్థిల్లుతుందన్నారు. పాలనలో వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుతామన్నారు. బడ్జెట్లోని అత్యధిక శాతం నిధులను క్షేత్ర స్థాయికి నేరుగా అందించి ప్రజలతోనే పర్యవేక్షించే విధంగా పాలన అందిస్తామని బాలినేని వివరించారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, డివిజన్‌ అధ్యక్షుడు పి. మురళి, నాయకులు కె. వెంకటేశ్వర్లు, సీహెచ్‌. రాంబాబు, కె.శ్రీను, పి.శ్రీను, విజయ్‌, శివ, రమేష్‌, పి. వినోద్‌, ఎన్‌. వినోద్‌, కేశవ్‌, కల్యాణ్‌, పల్లా అనురాధ, బడుగు ఇందిర, రవణమ్మ, కటారి శంకర్‌, వెలనాటి మాధవరావు, బేతంశెట్టి హరిబాబు, బాలిశెట్టి నాగేశ్వరరావు, తోటపల్లి సోమశేఖర్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here