ప్రకృతి వైపరీత్యాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో ప్రస్తుతం చెన్నై మహానగరం లో ప్రత్యక్షం గా కనపడుతోంది. జనజీవనం స్తంభించిపోయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోన్న చెన్నై నగర వాసులకు అండగా నిలవటం అవసరం. చెన్నై నుండి వస్తోన్న చిత్రాలను చూసి చలించిపోయిన నందమూరి సోదరులు ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తమ వంతు సహాయం గా తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి సహాయాన్ని ప్రకటించారు. ఎన్టీఆర్ 10 లక్షల రూపాయలను, కళ్యాణ్ రామ్ 5 లక్షల రూపాయలను ప్రకటించారు. ” చెన్నైతో మాకు ఉన్న అనుబంధం మరువలేనిది. అటువంటి మహానగరం నుండి నేడు వస్తోన్న చిత్రాలను చూస్తోంటే చాలా బాధ గా ఉంది. ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండవలసిన సమయం ఇది. సహాయం అందించగలిగిన ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది. మా తరపున ఆర్ధిక సహాయాన్ని తమిళ నాడు చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నాం. చెన్నై త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాం”, అని ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ తెలిపారు.