చిత్తూరు జిల్లాకు కృష్ణ జలాలు!!

అనంత జీవనాడి అనగానే హంద్రీనీవా సుజల స్రవంతి పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) కూడా సొంతం చేసుకోనుంది. ఇప్పటికే హంద్రీనీవా ద్వారా జిల్లాకు వస్తున్న కృష్ణమ్మ జలాలు… తాగునీటి కష్టాలను, కొంతమేర సాగు ఇక్కట్లను తీరుస్తున్నాయి. ఈ పథకంలో ఇప్పటి వరకు జిల్లాలో రెండు జలాశయాలకే నీరు చేరుతుండగా… మరో రెండు జలాశయాల్లో కృష్ణమ్మ పరవళ్లు ఈదఫా ఉండవని అంతా భావించారు. అయితే పుట్టపర్తి వద్ద భూసేకరణకు మార్గం సుగమం కావడం, అక్కడ అపరిష్కృత పనులు మొదలు కావడంతో అనంతపురం, చిత్తూర్ జిల్లాల వాసుల కల త్వరలో నెరవేరే అవకాశం !!
హంద్రీనీవా మొదటి దశ జీడిపల్లి జలాశయంతో ముగుస్తుంది. అక్కడి నుంచి రెండో దశ మొదలవుతుంది. ఇప్పటి వరకు జీడిపల్లి, గొల్లపల్లి జలాశయాలకు మాత్రమే కృష్ణమ్మ వస్తోంది. అయితే బుక్కపట్నం మండలంలోని మారాల జలాశయం, కదిరి మండలంలో ఉన్న చెర్లోపల్లె జలాశయాలకు నీటి ప్రవాహం ఈ ఏడాది కూడా ఉండదనే సందేహాలు ఉండేవి. పుట్టపర్తి పరిధిలోని కమ్మవారిపల్లె వద్ద ప్యాకేజీ-9బిలో భాగమైన హంద్రీనీవా ప్రధాన కాల్వ కి.మీ. 340.450 నుంచి 340.950 వరకు 500 మీటర్ల మేర కాల్వ పనులు జరగలేదు. అక్కడ భూసేకరణ సమస్య తలెత్తడంతో చాలా కాలంగా పనులు ఆగిపోయాయి. పరిహారం విషయంలో భూ యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే పొందారు. అయితే ఈ సమస్య కొంత కొలిక్కి రావడంతో ఇటీవల కాల్వ పనులు ఆరంభించారు.
నెలాఖరుకు లక్ష్యం..
పుట్టపర్తి వద్ద పెండింగ్‌ ఉన్న కాల్వ పనిలో భాగంగా 1.86 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వి తీయాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి కాల్వ పూర్తికావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో రోజుకు 6,700 క్యూబిక్‌ మీటర్లు చొప్పున మట్టి తీస్తున్నారు. జేసీబీలు, టిప్పర్లు తదితర యంత్రాలు, వాహనాలు కలిపి మొత్తం 25 వరకు అక్కడ పనిచేస్తున్నాయి. వీటితో నిరంతరం పనిచేయిస్తే 20 రోజుల్లో ఈ 500 మీటర్ల కాల్వ పనులు పూర్తవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇక బుక్కపట్నం వద్ద ప్యాకేజీ-10బిలో భాగంగా 358.150 కి.మీ నుంచి 360.250 కి.మీ వరకు సొరంగం పనులు జరుగుతున్నాయి. ఇందులో 10 మీటర్ల మేర మినహా మిగిలిన సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా మిగిలిన 10 మీటర్ల పనులు ఈ నెల 20 నాటికి పూర్తిచేయనున్నారు.

దిగువకు పరవళ్లు…
పుట్టపర్తి వద్ద 500 మీటర్ల కాల్వ పనులు పూర్తికావడం, బుక్కపట్నం వద్ద సొరంగం పనులు పూర్తయితే కృష్ణమ్మ పరవళ్లు మున్ముందుకు వెళ్లనున్నాయి. ముందుగా బుక్కపట్నం మండలంలోని హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 371.040 కి.మీ. వద్ద సిద్ధమైన మారాల జలాశయానికి నీరు చేరనుంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్‌ పనుల్లో 90 శాతం వరకు పూర్తయ్యాయి. 0.464 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ జలాశయాన్ని తొలిసారిగా నీటితో నింపనున్నారు. ఆ తర్వాత ప్రధాన కాల్వలోని 400 కి.మీ వద్ద నుంచి పుంగనూరు బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఇందులోని ప్యాకేజీ-26బిలో భాగంగా కదిరి మండలంలో చెర్లోపల్లి జలాశయం నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ కూడా దాదాపు 86 పనులు జరుగుతున్నాయి. ఇక్కడి జలాశయ మట్టికట్ట, తదితర పనులను గుత్తేదారు సంస్థ శరవేగంగా చేస్తోంది. 1.425 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయానికి కూడా త్వరలో కృష్ణమ్మను తీసుకెళ్లనున్నారు. దీంతో హంద్రీ-నీవాలో భాగంగా జిల్లాలోని జీడిపల్లి, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలకు నీరిచ్చినట్లు అవుతుంది. తరువాత చిత్తూర్ జిల్లాకు నీటి తరలిస్తారు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *