చంద్రబాబు నాయుడు నా…కమల్‌ హాసన్‌

హీరో కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర మొదలైంది. ఈరోజు ఉదయం ఆయన రామేశ్వరానికి చేరుకున్నారు. అక్కడ మత్య్సకారులతో సమావేశమయ్యారు. అనంతరం స్థానిక హయత్ ప్లే్‌స్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. కమల్‌ రాగానే అభిమానులు ‘సీఎం వచ్చారు’ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్‌ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు. రాజకీయ యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చి శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాకు శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను.’

‘రామేశ్వరంలో కలాం చదివిన పాఠశాలకు వెళ్లాలనుకున్నాను. కానీ పాఠశాల యాజమాన్యం నాకు అనుమతి ఇవ్వలేదు. పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకోగలిగారు కానీ నేను నేర్చకోవాలనుకున్న విషయాలను మాత్రం అడ్డుకోలేరు. తమిళనాడు ప్రజల గుండెల్లో నేనున్నాను. ఇప్పుడు వారి ఇళ్లల్లోనూ ఉండాలనుకుంటున్నాను. సినిమాలకు,  రాజకీయాలకు పెద్ద తేడా లేదు. రెండు రంగాలు ప్రజల కోసమే. కానీ సినిమాల కంటే రాజకీయాల్లో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బంతా ప్రజలదే. కలాం చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు ఎందుకు రాలేదు అని చాలా మంది అడుగుతున్నారు. సాధారణంగా నేను అంత్యక్రియలకు హాజరుకాను.’ అని చెప్పుకొచ్చారు కమల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *