క్యూ కడుతున్న మరో 19 ఐటీ కంపెనీలు…త్వరలోనే ప్రారంభం!

నవ్యాంధ్రకు ‘ఐటీ సంక్రాంతి’ వస్తోంది. పండక్కి ముందు, ఆ తర్వాత మూడు విడతల్లో పలు ఐటీ కంపెనీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఒక్క నెలలోనే దాదాపు రెండు వేల ఐటీ ఉద్యోగాలు దక్కనున్నాయి. అవే కంపెనీలు రానున్న మూడేళ్ల కాలంలో మరో 10వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. రాజధాని అమరావతితోపాటు… రాయలసీమలోని తిరుపతిలో, ఉత్తరాంధ్రలోని విశాఖలోనూ ఈ కంపెనీలు కొలువు తీరుతుండటం విశేషం. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ నాలుగు నెలలుగా ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. నెల రోజుల క్రితం అమెరికా వెళ్లినప్పుడు మంచి కంపెనీలు ఏపీకి వచ్చేలా ఒప్పించారు. అందులో భాగంగా అమెరికాలోని జోహో కంపెనీ తిరుపతిలో ఏర్పాటవుతోంది.

ఇక ఉపాధి వివరాల్లోకి వెళితే..ప్రస్తుతానికి 200 మంది ఉద్యోగులతో మొదలవుతున్న ఈ సంస్థ… మూడేళ్లలో ఐదువేల మందికి కొలువులు ఇవ్వనుంది. అవసరమైన భూమిని సొంతంగా కొనుగోలు చేసుకుంటామని కూడా ఈ కంపెనీ ప్రతిపాదించడం విశేషం. తిరుపతి టెక్‌ పార్కుకు మెస్సర్స్‌ ఏజీఎస్‌ హెల్త్‌, పారికర్‌, ఎక్సాఫ్లుయన్స్‌, నాస్‌టెక్‌, వైఐఐటీ కంపెనీలు రానున్నాయి.

410 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. జోహోతో పాటు ఆయా కంపెనీలను ఈ నెల 13వ తేదీన లోకేశ్‌ ప్రారంభించనున్నారు. విశాఖలో కాండ్యుయెంట్‌: ‘జిరాక్స్‌’ కంపెనీకి అనుబంధంగా ఉన్న కాండ్యుయెంట్‌ విశాఖపట్నంలో వచ్చే నెలలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సంస్థ ప్రతినిధులను లోకేశ్‌ మూడుసార్లు కలిసి చర్చించారు.

అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న సంస్థకు 40 దేశాల్లో శాఖలున్నాయి. ఈ నెల 20న తమ కంపెనీకి కావాల్సిన ఐటీ ఉద్యోగుల కోసం ఈ సంస్థ మెగా జాబ్‌ మేళా నిర్వహించనుంది. 200 మందిని ఎంపిక చేసుకోనుంది. రాష్ట్రం నుంచి ఏడేళ్ల క్రితం వెళ్లిపోయిన సదర్‌ ల్యాండ్‌ కంపెనీని మళ్లీ విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సదరు కంపెనీ సీఈవోతో ఇటీవల చర్చలు జరిపారు. కాగా.. సంక్రాంతి ముగియగానే అమరావతిలో 17న 13 కంపెనీలను ప్రారంభించనున్నారు.

వీటిలో 2వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో మార్చి నాటికి 10వేల అదనపు ఉద్యోగాలు కల్పించాలని ఐటీ శాఖ, ఏపీఎన్‌ఆర్‌టీలాంటి సంస్థలు కృషి చేస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *