కేంద్రాన్ని చూసి కాదు…బాబుపై నమ్మకంతోనే!

30

కేంద్రాన్ని చూసి కాదు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. యూరోపియన్‌ దేశాల్లో పర్యటించిన సమయంలో కూడా పలు సంస్థల అధిపతులు ఈ విషయం చెప్పారని వెల్లడించారు. ఈ నెల 24 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కేంద్రం నిర్వహిస్తున్న సదస్సుకు రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్రం నుంచి అన్యాయం జరుగుతోందనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ప్రత్యేక ప్యాకేజీలో ప్రకటించిన విధంగా ప్రోత్సాహకాలు సాధించేందుకు తాము కృషి

చేస్తున్నామన్నారు..విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు సందర్భంగా రూ.3లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకునేందుకు పలు సంస్థలు అంగీకరించాయని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. సదస్సు ప్రారంభం నాటికి ఈ మొత్తం ఇంకా పెరుగుతుందన్నారు.

2016 సదస్సులో చేసుకున్న ఒప్పందాల్లో 44.26శాతం, 2017 సదస్సులోని ఒప్పందాల్లో 39.76శాతం అమల్లోకి వచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయన్నారు. మంగళగిరి వద్ద మంగళవారం అత్యాధునిక పరిశోధనశాల ప్రారంభించామన్నారు. ఇందులో వివిధ దేశాలకు ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తులను పరీక్షించుకోవచ్చన్నారు.

విద్యుత్తు వాహనాలను అందుబాటులోకి తేవడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుంటుందని అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. కియా సంస్థ కూడా దీనిపై దృష్టి పెట్టిందన్నారు. ఈ నెల 22న కియా మోటార్స్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని చెప్పారు.

మంగళగిరిలో లిండే ఇండియా సంస్థ ఏర్పాటుచేసిన ఆహార ప్రయోగశాల, శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలో లిండే సంస్థ వినూత్న ఆహార శుద్ధి సాంకేతికతతో ముందుకురావటం అభినందనీయమన్నారు. ఆహారోత్పత్తుల పరిశ్రమకు అవసరమైన క్రయోజెనిక్‌ ఫ్రీజింగ్‌ చిల్లింగ్‌ టెక్నాలజీని అందించటంలో లిండే సంస్థకు దశాబ్దాలుగా పేరుందన్నారు. లిండే గ్యాసెస్‌, తూర్పు ఆసియా ముఖ్య ప్రతినిధి మోలోయ్‌ బెనర్జీ మాట్లాడుతూ తాము ఏర్పాటుచేసిన ప్రయోగశాల, శిక్షణ కేంద్రం అందించే సాంకేతికత ఆహారశుద్ధి పరిశ్రమ అధిక లాభాలు పొందటానికి దోహాదపడుతుందని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here