కేంద్రం తీరు- 5 కోట్ల జీవితాలు తారుమారు: సీఎం చంద్రబాబు

విభజనతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. సాయం చేయకుండా ఏపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరువల్ల 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా అప్పట్లో ఏపీలో మోదీ ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. అదే సందర్భంలో పోలవరంలో జరుగుతున్న పనులను లైవ్ ద్వారా సీఎం చంద్రబాబు చూపించడం విశేషం .

ఢిల్లీ లో జాతీయ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు ప్రసంగించారు.
“విభజన శాస్త్రీయంగా జరగాలని అప్పట్లో నేను కోరా. విభజన వల్ల వచ్చే సమస్యలపై శ్వేత పత్రం కూడా విడుదల చేశాం. ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుంద‌నే ఎన్డీఏలో చేరాం. విభజన వల్ల వచ్చిన నష్టంపై సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాం. నేను 29 సార్లు ఢిల్లీకి వచ్చాను. ఏపీ విడిపోయి నాలుగేళ్లయినా సాయం చేయలేదు. విభజన సమయంలో చాలా నష్టపోయామని వివరిస్తూ చెబుతోన్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. ఏపీకి సాయం చేస్తున్నామంటూ, త్వరలోనే మరింత సాయం అందిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ వరకు ఎదురు చూశాం. చివరి బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక సాయం ఏమీ చేయలేదు. కనీస సాయం చేయకుండా ఏపీపై ఎదురుదాడికి దిగుతున్నారు. విభజనతో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఎన్నికల సమయంలో ఏపీకి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు. అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, అమరావతిలో అత్యద్భుత రాజధానిని నిర్మిస్తామని మోదీ చెప్పారు. మొదట ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఆ తరువాత హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామని చెబితే అంగీకరించాం. రెండున్నరేళ్లుగా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూశామని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఓ లేఖ కూడా రాశాను. మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ అంటోంది. ఏపీకి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయింది . చివరి బడ్జెట్లో కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని నీతి అయోగ్, కేంద్ర ప్రభుత్వం చెప్పాయి. ఏపీకి ఎంతో ప్రధానమైన పోలవరం పనులు పూర్తి స్థాయిలో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుకు నిధులను సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. పోలవరంపై మేము ఖర్చు చేసిన రూ. 3 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ప్రత్యేక హోదాను ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. కానీ, ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులను అడిగితే అలాంటిదేమీ లేదని చెప్పారు. చేయాల్సిన సహాయాన్ని చేయకుండానే మాపై విమర్శలు కురిపించే కార్యక్రమాన్ని చేపట్టారు. నిధులకు సంబంధించిన యూసీలను సమర్పించినప్పటికీ… ఇవ్వలేదని అంటున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా, మాపై బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నా పరపతిని డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు,’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *