కాంగ్రెస్‌లో చేరిన సినీనటి ఊర్మిళ

127

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఊర్మిళ మతోంద్కర్‌ కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లిన ఊర్మిళ.. ఆయనతో కాసేపు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఊర్మిళ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు ఎంతో ముఖ్యమైన రోజు. నా చిన్నప్పటి నుంచి మహాత్మాగాంధీ గురించి తెలుసుకుంటూ ఆయన నుంచి స్ఫూర్తి పొందాను. ప్రస్తుతం దేశంలో భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ లేదు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. ఆ సిద్ధాంతాలు నచ్చే నేను పార్టీలో చేరాను. అంతేగానీ ఎన్నికల కోసం కాదు’ అని తెలిపారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఊర్మిళ ముంబయి ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు భాజపాకు మంచి పట్టు ఉంది. 1989 నుంచి 2004 వరకు భాజపా నేత రామ్‌ నాయక్‌ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌ నాయక్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవిందా గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి సంజయ్‌ నిరుపమ్‌ విజయం సాధించారు. గత ఎన్నికల్లో సంజయ్‌ నిరుపమ్‌పై భాజపా నేత గోపాల్‌ శెట్టి భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఈ నియోజకవర్గంపై కమలం పార్టీ మళ్లీ పట్టు పొందగలిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ స్థానంపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టిపెట్టింది. భాజపాకు పోటీగా ప్రముఖ నేతను బరిలోకి దింపాలని భావిస్తోంది. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఊర్మిళ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అంతం, అనగనగా ఒక రోజు, గాయం లాంటి చిత్రాల్లో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here