కడపలో స్టీల్‌ ప్లాంట్‌ను నిర్మించి తీరుతా;సీఎం జగన్

82

కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయని.. గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా ఆయన కడప జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించి జగన్‌ పలు హామీలు ఇచ్చారు. ‘‘కడప ఉక్కు పరిశ్రమ ఏ పనీ జరగక ఆగిపోయిన పరిస్థితిలో ఉంది.

డిసెంబర్‌ 26న జగన్‌ అనే నేను వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నా. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మీ అందరికీ అందిస్తానని మాటిస్తున్నా.

మీ అందరి కలల్ని సాకారం చేస్తానని సగర్వంగా చెబుతున్నా. ఈ ప్రాజెక్టు ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది’’ అని జగన్‌ హామీ ఇచ్చారు.

‘‘కుందూ నదిపై రాజోలి జలదరాశి ప్రాజెక్టును సైతం పూర్తిచేస్తాం. కేసీ కెనాల్‌ కింద కడప జిల్లాలో సాగునీరు అందని పరిస్థితుల్లో రైతులు అల్లాడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి కోసం కుందూ నదిపై జలదరాశి ప్రాజెక్టు కడతాం. దానికి కూడా డిసెంబర్‌ 26న శంకుస్థాపన చేస్తా. ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తాం.

జిల్లాలో బ్రహ్మంసాగర్‌కు నీళ్లందని పరిస్థితి ఉంది. వెలుగోడు నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న ఈ బ్రహ్మంసాగర్‌కు నీళ్లు అందని పరిస్థితి కళ్లముందే కనబడుతున్నా పట్టించుకొనే నాథుడేలేడు.

చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంత ఖర్చయినా పర్వాలేదు. ఆ ప్రాజెక్టు పూర్తిచేస్తాం. దివంగత నేత వైఎస్‌ఆర్‌ కలలుగన్న రోజుల్ని మళ్లీ తీసుకొస్తా.

దేవుడు కరుణిస్తే గండి కోట రిజర్వాయర్‌లో ఈ సంవత్సరం 20 టీఎంసీలు నీరు నిల్వచేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గండికోట నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇస్తాం. రైతులకు తోడుగా ఉంటా. సమాజంలోని ప్రతి కుటుంబం బాగుండాలని కోరుకునే ప్రభుత్వం మాది. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, చివరకు రాజకీయాలు కూడా చూడకుండా ప్రతి ఒక్కరికీ మంచి చేసే ప్రభుత్వం మనది. ఇందుకోసం మీ అందరి దీవెనలు కావాలి’’ అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here