ఏపీ ఆర్టీజీఎస్ ప‌నితీరు అద్భుతం..!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకున్న రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్ వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేస్తోంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ ర‌మేశ్‌చంద్ కితాబిచ్చారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ స్టేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని శుక్ర‌వారం ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అహ్మ‌ద్‌బాబు పాల్గొని ఆర్టీజీఎస్ ప‌నితీరును ర‌మేశ్‌చంద్‌కు వివ‌రించారు. రియ‌ల్ టైమ్ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి ఈ కేంద్రం సేవ‌లు అందిస్తున్న తీరును తెలిపారు. ప‌రిష్కార వేదిక 1100 కాల్‌సెంట‌ర్ ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించి వాటిని ఎలా ప‌రిష్క‌రిస్తుందో వివ‌రించారు. గ‌డ‌చిన 9 నెల‌ల కాలంలో ప‌రిష్కార‌వేదిక ద్వారా 1,48,50,297 ఫిర్యాదులు స్వీక‌రించ‌గా అందులో 93 శాతం ప‌రిష్క‌రించామ‌న్నారు. స‌మ‌స్య ప‌రిష్క‌రం త‌రువాత ఫిర్యాదుదారుకు ఫోన్ చేసి వారి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ప‌నితీరు ప‌ట్ల ప్ర‌జ‌ల సంతృప్తి స్థాయి ఎలా ఉంద‌నేది ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్న‌ట్టు వివ‌రించారు. ఈ-ఆఫీసు ప‌నితీరు, కోర్ డ్యాష్‌బోర్డు గురించి తెలియ‌జేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స‌ర్వైలెన్స్ కెమెరాల ద్వారా ఎలా ప‌ర్య‌వేక్షిస్తుందీ కూడా సీఈఓ బాబు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా నీతి ఆయోగ్ స‌భ్యులు ర‌మేశ్‌చంద్ మాట్లాడుతూ ఆర్టీజీఎస్ వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేస్తోంద‌ని, టెక్నాల‌జీ వినియోగం వినూత్న ఆలోచ‌న‌ల‌తో దూసుకెళుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. ఏపీలో ఉన్న ఆర్టీజీఎస్ వ్య‌వ‌స్థ ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శప్రాయం కావాల‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ క‌మీష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *