ఏపీని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుస్తాం; సీఎం


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని క్రీడాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారుస్తామ‌ని, అమ‌రావ‌తి కేంద్రంగా ఒలింపిక్స్ నిర్వ‌హించేందుకు క‌స‌రత్తు చేస్తున్నామ‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అమరావతి మారథాన్ రన్ 2018 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ అమరావతి మారథాన్ రన్‌కు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నామని, మూడేళ్ల కాలంలోనే ఈ రన్‌కు మంచి గుర్తింపు వచ్చిందని చంద్రబాబు అన్నారు. అమరావతి మారథాన్ రన్‌లో భాగస్వాములైన వారందరికీ అభినందనలు తెలిపారు. అమరావతి రాజధాని రన్‌లో చూడటానికి వచ్చిన వారు వచ్చే సంవత్సరం రన్‌లో పాల్గొంటారని, ఈ సంవత్సరం అవార్డులు రానివారికి వచ్చే సంవత్సరం వచ్చే అవకాశం ఉందన్నారు. గుంటూరు పూర్వ కలెక్టర్ కాంతిలాల్ దండే సైతం రన్‌లో పాల్గొనటం అభినందనీయమన్నారు. పరిగెత్తిన వారికి ఇప్పుడు అవార్డు రాకపోయినా ముందు ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి వ్యాయామం అవసరం కావాలని తెలిపారు. అమరావతిలో మారథాన్ నిర్వహిస్తామని కొద్దిమంది త‌న దృష్టికి తీసుకురాగానే అంగీకారం తెలిపాన‌న్నారు. అమరావతి మారథాన్ రన్‌ను అమరావతితో పాటు, తిరుపతి, విశాఖలలో నిర్వాహకులను అభినందించారు. ఆదివారం నిర్వహించిన అమరావతి మారథాన్ రన్‌లో 7,500 మంది పాల్గొనటం మంచి పరిణామమని, ఇందులో అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు పాల్గొనటం వల్ల తక్కువ కాలంలోనే దీనికి మంచి ఆదరణ వచ్చినట్లు తెలుస్తుందన్నారు. హైదరాబాద్‌లో 23 ఏళ్ల క్రితం 10కే రన్ను నిర్వహించామని, ఇది ఇప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలలో అమరావతి మారథాన్ రన్ నిర్వహించాలని పిలుపునిచ్చామని, అందులో ఎంపీలు, మత్రులు, నేతలు పాల్గొంటున్నారన్నారు. జన్మభూమి కార్యక్రమంలో క్రీడలు నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. గతంలో చాలామంది ఉద్యోగాలు ముగించిన తర్వాత క్రీడలు ఆడేవారని, క్రీడలు ఆనందానికి ఎంత‌గానో ఉపయోగపడతాయన్నారు. మారథాన్‌కి ఒక ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి మనిషి ఒక గంటపాటు ఆటలు ఆడే అలవాటు చేసుకోవాలన్నారు. వయసుకు, వ్యాయామానికి సంబంధం లేదని 80 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు చేయవచ్చు అని తెలిపారు. వచ్చిన ఏ ఆట ఆడినా మనసు ఆనందంగా ఉండటంతో పాటు, ఆసుపత్రికి వెళ్లాల్సిన పని ఉండదన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి ఒక్కరూ క్రీడలు ఆడటం ఒక అలవాటుగా చేసుకోవాలని, అప్పుడే ఫిట్‌గా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏపీని ఒక క్రీడాంధ్రప్రదేశ్ రాష్టంగా చేయటానికి ముందుకు వస్తున్నామని, దానికి సహకరించాలన్నారు. నగరాలలో, మున్సిపాలిటీలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో నేషనల్ గేమ్స్, ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి మంచి ఇన్ఫ్రాస్టక్చర్ సమకూర్చామన్నారు. అమరావతి కేంద్రంగా ఒలింపిక్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందని, నేడు చిన్న దేశాలు సైతం ఒలింపిక్స్ నిర్వహిస్తున్నాయని, ప్రపంచంలోనే పెద్ద దేశమైన భారతదేశం ఇంతవరకు ఒలింపిక్స్ నిర్వహించలేకపోయిందన్నారు. మన పిల్లలకు తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయని వారికి శిక్షణ, ప్రోత్సాహాన్నిస్తే లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. అందుకే గోపీచంద్ లాంటి వారికి అకాడమీలు పెట్టుకోవటానికి స్థలాలు ఇచ్చామన్నారు. మెడల్స్ సాధించిన పీవీ సిందూ, శ్రీకాంత్‌లకు గ్రూప్-1 అధికారులుగా ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహించామన్నారు. యువత మీ శక్తిని మీరు గుర్తుపెట్టుకోవాలని, క్రీడలు యువతకు జీవితంలో ఒక భాగం కావాలన్నారు. క్రీడలు వల్ల ఆరోగ్యంతో పాటు, డబ్బులు, ఎనలేని పేరు ప్రఖ్యాతలు వస్తాయన్నారు. విశాఖపట్నంలో సాయంత్రం పూట మారథాన్ నిర్వహించారని, చాలా బాగా సుందరమైన ఆహ్లాదమైన ప్రాంతంలో నిర్వహించారని తెలిపారు. ఏపీలో ఉన్న సుందర ప్రదేశాలు ఎక్కడా లేవని వాటిని ఉపయోగించుకుని క్యాలెండర్ ఇయర్ నిర్మించి స్పోర్ట్స్, సీఆర్డీఏ, టూరిజంలను కలుపుతూ కార్యక్రమాలు చేపడతామన్నారు. దేశంలోనే మొదటిగా కొత్త సంవత్సరం మొదటి వారంలో మారథాన్ రన్‌ను నిర్వహిస్తున్న రాష్టంగా ఏపీ ఉందన్నారు. ఈ సంద‌ర్భంగా 21కె, 10కె, 5కె ర‌న్‌ల‌లో గెలుపొందిన విజేత‌ల‌కు రూ.20 ల‌క్ష‌లు న‌గ‌దు బ‌హుమ‌తిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అమ‌రావ‌తి మార‌థాన్ ర‌న్ ప్రారంభంలో న‌గ‌ర మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌, మ‌హిళా కోప‌రేటీవ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్
ఛైర్‌ప‌ర్స‌న్ పంచుమ‌ర్తి అనూరాధ‌, క్రీడ‌లు శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎల్‌.వి.సుబ్ర‌హ్మ‌ణ్యం, జిల్లా క‌లెక్ట‌ర్ బి.ల‌క్ష్మీకాంతం, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ డి.గౌతం స‌వాంగ్‌ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *