ఏపీతో కలిసి పనిచేస్తాం; బ్రిటన్ మాజీ ప్రధాని

52

ప్రపంచవ్యాప్తంగా పాలన వ్యవస్థలో అమలు చేసే ఉత్తమ విధానాలపై దృష్టి నిలిపిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ నేతృత్వంలోని ‘టోనీ బ్లేయర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి కనబరించింది.

ఈ విషయాన్ని టోనీ బ్లేయర్ శుక్రవారం సింగపూర్ పర్యటనలో వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా వెల్లడించారు. భారత్‌లో ఇప్పటికే తమ సంస్థ 200 విద్యాలయాలతో కలిసి పనిచేస్తోందని వివరించిన బ్లేయర్,

భారత్‌లో తమకు కార్యాలయం వుందని, ప్రత్యేక బృందం కూడా ఇందుకోసం పనిచేస్తోందని చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు తమ బృందాన్ని పంపిస్తానని చెప్పారు.

ఈ ద్వైపాక్షిక సమావేశంలో రియల్‌టైమ్ గవర్నెన్స్, సమగ్ర ఆర్ధిక నిర్వహణ విధానం, విద్యుత్ సంస్కరణలు, సౌర-పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు

ఇలా ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను బ్లేయర్‌కు ముఖ్యమంత్రి వివరించారు.
చంద్రబాబుతో జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న బ్లేయర్
ఒకప్పటి తన హైదరాబాద్‌ సందర్శనను,

ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబుతో కలిసి మహబూబ్‌నగర్‌లోని ఒక గ్రామాన్ని పరిశీలించిన జ్ఞాపకాలను టోనీ బ్లేయర్ గుర్తు చేసుకున్నారు.

వాజ్‌‌ పేయి ఎంతో ఆదరాభిమానాలు చూపారని బ్లేయర్ వెల్లడించారు. ఎప్పుడైనా భారత్ వెళ్లినప్పుడు ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి

అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనకు చెప్పిన సంగతిని తెలిపారు. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సందర్శనకు వచ్చానని చెప్పారు. 1978 నుంచి 40 ఏళ్లగా రాజకీయాలలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందంటూ చంద్రబాబు దగ్గర బ్లేయర్‌ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

కొత్త రాష్ట్రం ఎలా ఉందని బ్లేయర్ ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తున్న తీరు తనకు తెలుసునని బ్లేయర్ పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ముందుకొచ్చి తమకు సమీకరణ విధానంలో ఎలా భూములు అందించిందీ ముఖ్యమంత్రి వివరించారు.

పెట్టుబడుల ఆకర్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు, వచ్చే 20 ఏళ్ల పాటు 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తున్న తీరును, ఫైబర్ కనెక్టివిటీ, ఆహార శుద్ధి రంగంలో ఏపీలో ఉన్న అపార అవకాశాలను బ్లేయర్‌కు తెలిపారు.

స్పష్టమైన విజన్‌తో నూతన రాష్ట్రాభివృద్ధికి ఎలా ముందుకెళ్తున్నది బ్లేయర్‌ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువచ్చారు. 2022, 2029, 2050 లక్ష్యాలను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం 50 శాతం చేయాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు, వాటి అమలు తీరు, ఇతర కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకునేందుకు బ్లేయర్ ఆసక్తి కనబరిచారు. ఏపీని సందర్శించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించగా, అందుకు బ్లేయర్ సుముఖత వ్యక్తం చేశారు.

సచిన్‌తో ముఖ్యమంత్రి మాటామంతీ
బ్లేయర్‌తో సమావేశానికి ముందు ముఖ్యమంత్రిని మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో సచిన్ దత్తత తీసుకున్న గ్రామం అభివృద్ధిపై ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది.

ముఖ్యమంత్రితో పాటు సింగపూర్ పర్యటించిన బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఏపీ ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిషోర్ వున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here