ఏపీకి వస్తాం… పెట్టుబడులకు సిద్దం…!

ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ కొరియా పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. మూడు రోజుల పర్యటన కోసం దక్షిణ కొరియాకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజే సుమారు రూ.8 వేల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించడంలో విజయవంతమయ్యారు. 37 కొరియా సంస్థలు ఏపీలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు (APEDB)తో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ టు ఇన్వె్‌స్టమెంట్‌(LOI)పై సంతకాలు చేశాయి. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 7171 ఉద్యోగాలు రానున్నాయి. వీటితోపాటు కియ అనుబంధ సంస్థలు అన్నీ కలిపి రాష్ట్రంలో రూ.4995.20 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. సోమవారం ఉదయం కియ మోటార్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సీఎం బృందం సందర్శించింది. అనంతరం కియ అనుబంధ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి. భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి రండి. ఈ విషయంలో మీ దేశానికే చెందిన ‘కియ’ మోటార్స్‌ మీకు స్ఫూర్తి కావాలి’ అని పేర్కొన్నారు. కియా మోటార్స్‌ ప్రాజెక్టు పట్ల తాము ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్నామని, రాష్ట్రంలో కొరియా టౌన్‌షిప్‌ నిర్మించడానికీ ఆసక్తితో ఉన్నామన్నారు. ఏపీ, దక్షిణ కొరియా నడు మ అనేక అంశాల్లో సారూప్యత ఉందన్నారు. ఏపీ లో తమ పెట్టుబడులపై కియ అనుబంధ సంస్థ లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాయి.

ఈ సంస్థల ద్వారా వేలాది మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని వివరించాయి. అనంతపురం జిల్లాలో కియ మోటార్స్‌ సంస్థకు కేటాయించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను ఏపీఐఐసీ అధికారులు వివరించారు.

దక్షిణ కొరియాలో కియ అనుబంధ సంస్థలను ఒకేసారి కలుసుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. కియ ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. అనేక అవరోధాలను, ప్రతికూలతలను అధిగమించి దక్షిణ కొరి యా అభివృద్ధి సాధించిన తీరు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు ప్రశంసించారు. ఇక్కడి పరిశ్రమలతోనూ బలమైన అనుబంధాన్ని కోరుకుంటున్నామన్నారు.

ఏపీలో ఎలాంటి వ్యాపార అవరోధాలూ తలెత్తబోవని హామీ ఇచ్చారు. ఏపీలో మౌలిక వసతులకు కొదవ లేదని, శాంతిభద్రతలు సమస్య లేదని, ఎటువంటి కార్మిక అశాంతి లేని వాతావరణం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని కియ అనుబంధ సంస్థల ప్రతినిధులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కియ అనుబంధ సంస్థల ప్రతినిధులు కోరిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *