ఏపీకి న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదు; చంద్రబాబు

119

ఆంధ్రప్రదేశ్ ను అన్ని విధాలా ఆదుకుంటామని తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా మాటిచ్చారు. ఆచరణలో అన్ని విధాలా మమ్మల్ని మోసం చేశారు. మూడు రోజుల సమయం ఇస్తున్నా..పార్లమెంటు వేదికగా క్షమాపణ చెప్పండి లేకుంటే ఏపీ ప్రజలు మిమ్మల్ని క్షమించరు” అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా సహా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను నెరవేర్చనందుకు కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాటదీక్ష చేపట్టారు. ఏపీభవన్ వేదికగా దీక్షకు దిగారు. 23 పార్టీలు చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా పలువురు నేతలు స్వయంగా దీక్షలో పాల్గొన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీని వేదికపై నిలదీశారు. ఏపీ హక్కుల సాధనలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ …ఫోన్ లో చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు.
కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతాం:
కేంద్రానికి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. కొన్ని పార్టీల అండతో గెలవొచ్చనే భ్రమలో మోదీ ఉన్నారని విమర్శించారు. మోదీ ధర్మాన్ని పాటించే వ్యక్తయితే గుంటూరుకు వచ్చి విమర్శించరని, విభజన గాయాన్ని ఇంకా పెద్దగా చేసి కారం చల్లి సంతోషిస్తున్నారని ఇది నీచం, పరమ దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆదుకోకపోతే ఏపీ చరిత్రలో బీజేపీ పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయే పరిస్థితి వస్తుందని, ఏపీలో బీజేపీకి పూర్తిగా తలుపులు మూసుకుపోతాయని హెచ్చరించారు. ఢిల్లీకి రావాలంటే అడ్డంకులు సృష్టిస్తారు. నిన్న గుంటూరు వచ్చారు…ప్రత్యేక హోదాపై మాట్లాడారా? అని ప్రధాని మోదీని సూటిగా ప్రశ్నించారు. ఏపీలో అడుగుపెట్టే హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నా? అనుకున్నది సాధించే వరకు ఎంత దూరమైనా వెళ్తాం అంటూ చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

దేశంలో ఏపీ భాగం కాదా?: రాహుల్ గాంధీ
ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారో లేదో ప్రధాని మోదీ చెప్పాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభా వేదికగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ విశ్వసనీయత కోల్పోయారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నాంచారు గత ప్రధాని ఇచ్చిన హామీలను ఈ ప్రధాని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ దేశ ప్రజల సెంటిమెంట్ ఎలా ఉంటుందో రెండు నెలల్లో చూపిస్తాం. రఫేల్‌ గురించి పత్రికల్లో ఏ వార్త వచ్చిందో తెలియదా.. చౌకీదార్ చోర్ అయ్యాడు. ఏపీ ప్రజల సొమ్మును .. అనిల్ అంబానీకి దోచి పెట్టారు. మోదీని, బీజేపీని ఓడిద్దాం అంటూ రాహుల్ పిలుపునిచ్చారు.
ఏపీకి అండగా ఉంటాం:
పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్టని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి హామీ ఇచ్చి అమలు చేయలేదని కేజ్రీవాల్ విమర్శించారు. మోదీపై పోరాటంలో చంద్రబాబుకు మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మోదీ సర్కార్‌కు ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడిందంటూ తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత డెరిక్ ఒబ్రెయిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు నెలల్లో మీ ఎక్సపైరీ డేట్ పూర్తవుతుంది. మీ అడ్రస్ మారబోతోంది. అన్ని రాష్ట్రాలను అవమానపరుస్తున్నారు. 2019లో బీజేపీకి ముగింపు పలుకుతున్నాం అని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబు పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు. తనను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఎంతో గౌరవించారని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సమాజ్ వాదీ మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా.. మీతో పాటు ఉంటాం. మీరిచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. చంద్రబాబు బలహీన పడితే.. దేశ రాజకీయాలకు అంతమంచిది కాదు. చంద్రబాబులాంటి నేత కలిగి ఉన్నందుకు ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులు. ఆయన బతికి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి

అంటూ దీక్షకు సంఘీభావాన్ని ములాయంసింగ్ యాదవ్ తెలిపారు.
పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఎల్జేడీ నేత శరద్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్రం ధర్మం తప్పడం వల్లే ఏపీ ప్రజలు ఇక్కడికి వచ్చారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తూ.. చంద్రబాబు మంచి పని చేస్తున్నారని అభినందించారు. ఆంధ్రాలో ప్రధాని మాటలు ఆయన దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు.
మేము సైతం:
దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీ తరలివచ్చారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా కార్యకర్తలు రావడంతో ఏపీ భవన్ మొత్తం నిండిపోయింది. వీరితో పాటు ఉద్యోగ, ప్రజా సంఘాలు, ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు దీక్షలో పాల్గొన్నారు.
దీక్ష ప్రారంభానికి ముందు రాజఘాట్ లో మహాత్మా గాంధీ స్మృతి దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులూ నివాళులర్పించారు. ఆ తర్వాత బి ఆర్ అంబెడ్కర్ విగ్రహం ముందు నివాళులర్పించారు దీక్షను ప్రారంభించారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి దీక్షకు మద్దతు గా ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
సైడ్ లైట్స్….
• వేదికపై ఉన్న ఎన్టీఆర్ చిత్రపటానికి రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.
• ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన ప్రసంగాన్ని జై ఆంధ్రా అంటూ ముగించారు.
• మౌన మునిగా పేరున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వేదికపై సీఎం చంద్రబాబుతో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.
• మాది దశాబ్దాల అనుబంధం అంటూ వేదికపై ఉన్న గులాంనబీ ఆజాద్ ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
• టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ …తెలుగు తల్లి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
• జాతీయ నేతలు పలువురు తమ ప్రసంగంలో తెలుగు భాష ద్వారా నాయకులను సంబోధించి తెలుగు వారు అంటే తమకు ప్రత్యేక అభిమానమని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here