ఏపీకి ఏఐఐబీ ఆర్ధికసాయం!

59

ఆంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక సాయం అందించడానికి, రహదారులు, నీటి పారుదల, ఇంధన రంగాల్లో సహకరిస్తామని ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) వెల్లడించింది. భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి కనపరిచింది. అభివృద్ది పనులకు అత్యంత వేగంగా నిధులు సమకూరుస్తామని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదివారం సింగపూర్‌లో కలిసిన ఏఐఐబీ డైరెక్టర్ జనరల్ (పెట్టుబడి వ్యవహారాలు) పాంగ్ యీ ఇయాన్ తెలిపారు. ఇప్పటికే గ్రామీణ రహదారులు, పారిశుధ్యం విషయాలలో ఏఐఐబీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ బృందంతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తాము చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వున్నాయని, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కష్టపడి పనిచేసి అభివృద్ది ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారని పాంగ్ ప్రశంసించారు. అమరావతి నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ తప్పనిసరిగా భాగస్వాములం అవుతామని వెల్లడించారు.
కెపాసిటీ ఫండింగ్ విషయంలో సాయపడాలని ముఖ్యమంత్రి కోరగా, ప్రాజెక్ట్ వివరాలు అందిస్తే సహాయపడతామని పాంగ్ చెప్పారు. వివిధ ప్రాజెక్టుల పనులపై తాను ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్‌లోనే గడుపుతుండటంతో రాష్ట్ర పౌరుడిగానే భావిస్తున్నానని పాంగ్ అన్నారు. అమరావతిలో అర్బన్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని, అమరావతి నగర బృహత్తర ప్రణాళిక తయారీలో తాను వ్యక్తిగతంగా పాలుపంచుకున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పాంగ్ తీసుకువచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులోనూ భాగస్వామ్యం అవ్వడానికి ఆసక్తి కనబరిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here