ఏపి విద్యుత్ సంస్థలకు చట్ట ప్రకారం ఆదాయం రావలసిన కేసులపై ప్రత్యేక దృష్టి : మంత్రి కళావెంకట్రావు

94

విద్యుత్ శాఖ పరిధిలోని ఏపిట్రాన్స్‌కో, ఏపి విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల నియమ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి శ్రీ కిమిడి కళా వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపుడిలోని తన కార్యలయంలో ఏపి విద్యుత్ సంస్థల్లో కోర్టు కేసుల పురోగతి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పిపిఏ) విండ్, సోలార్ విద్యుత్ తదితర అంశాలపై విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో ఇంధన శాఖ సలహాదారు శ్రీ కె.రంగనాథం, ఏపిట్రాన్స్‌కో జేయండీ శ్రీ దినేష్ పరుచూరి, ఏపి ట్రాన్స్‌కో న్యాయ సలహాదారు శ్రీ శివరావు, సి.ఈ ఐపిసి శ్రీ రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు (పిపిఏలు) సంబంధించి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఢిల్లీ, ఏపీఈఆర్సీ, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులు పరిష్కారం అయితే విద్యుత్ సంస్థలకు ఆదాయం వచ్చే కేసుల పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సుప్రీం కోర్టు కేసులకు సంబంధించి ప్రతి వాయిదాకు క్రమం తప్పకుండా అధికారులు హాజరు కావాలని, ఏఓఆర్ / సీనియర్ కౌన్సిల్ తో సమన్వయం చేసుకొని ట్రాన్స్‌కో తరపున వాదనలు బలంగా వినిపించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో టెండర్లు నియమావళి రూపొందించే సమయంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే సమయాన్ని పొందు పొరచాలని, నిర్ణీత సమయంలో సంబంధిత కంపెనీ పనులు పూర్తి చేయకుండా కాలవ్యవధి పొడిగిస్తే ఆ సమయంలో పిపిఏ లో పేర్కొన్న విద్యుత్ కొనుగోలు ధర కంటే.. మార్కెట్లో విద్యుత్ ధర తక్కువ ఉంటే ఆ రేటు మాత్రమే చెల్లించేలా నిబంధనను చేర్చాలని మంత్రి ఆదేశించారు.ఈ నిబంధనను టెండర్ దరఖాస్తులోను, పిపిఏ నిబంధనల్లోనూ ఖచ్చితంగా పొందుపరచాలని, దీనివల్ల విద్యుత్ సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో విద్యుత్ కొనుగోలులో ధరలు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

భవిష్యత్ లో సాంప్రదాయేతర ఇంధన వనరులైన విండ్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుందని, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే సమయంలో ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. విద్యుత్ రంగంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విభాగాల్లో మార్గదర్శకంగా ఉందని మంత్రి శ్రీ కిమిడి కళా వెంకట్రావ్ ప్రశంసించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here