ఉమ్మడి శాంతిభద్రతలపై గవర్నర్ నిర్లక్ష్యం..!

12-chandrababu-naidu-4తెలంగాణ రాజధాని మరియు ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక రాజధానిలో శాంతిభద్రతలను గవర్నర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆస్తుల రక్షణ కోసమే విభజన చట్టంలో సెక్షన్-8 పొందుపరిచారని, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన తీరు సరిగా ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు.  హైదరాబాద్‌ లాంటి రాజధాని కావాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలని ఆనాడే చెప్పానని, కనీసం ఏపీ రాజధాని ఎక్కడ నిర్మించాలో కూడా చెప్పకుండా ప్రాంతాల మధ్య చిచ్చురేపేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. రాజధానిలో భవనాల నిర్మాణాలకు నిధులు ఇస్తామన్నారు.. కానీ, ఎంత ఇస్తారన్నది స్పష్టంగా చెప్పలేదని కాంగ్రెస్ తీరును విమర్శించారు. ఏపీలో గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ ఏర్పాటుపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. విభజన సమయంలో ఆస్తులను ప్రాంతాల వారీగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా విభజన చట్టంలోని సెక్షన్-10లోని సంస్థలపైనా స్పష్టత లేకపోవడంతో ఆ సంస్థలన్నీ తమవేనని తెలంగాణ ప్రభుత్వం అంటోందని, దీంతో రాష్ట్ర పరిపాలనలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఏపీకి చెందిన అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికాలేదని, ఈ కారణంగా ఏపీ స్థానికత కలిగిన 1250 మంది టి. విద్యుత్ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *