ఉత్స‌వంలా జలసంరక్షణ ఉద్య‌మం:మంత్రి దేవినేని ఉమా


ఈ నెల 12 నుంచి జూన్ 7వ తేదీ వరకు 116 రోజులు పాటు నీరుప్రగతి-జలసంరక్షణ రెండవ విడత ఉద్యమ కార్యక్రమం ఓ ఉత్సవంలాగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన నీరు-ప్రగతి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొని నీరు-చెట్టు పనుల ప్రగతిని సమీక్షించారు. వచ్చే ఏడాదికి రూపొందించిన పనుల ప్రణాళికపైన, జల సంరక్షణ ఉద్యమంలో చేపట్టే పనులపైన చర్చించారు. చేపట్టిన పనులను, పూర్తి చేసిన పనుల వివరాలను సంబంధిత శాఖల అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పనుల విషయమై శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. నీటి సంఘాల భాగస్వామ్యంతో జల సంరక్షణ ఉద్యమంలో చేపట్టే చెరువుల మరమ్మతులు, చెరువుల అనుసంధానం, కాలువల్లో పూడిక తొలగింపు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఊట గుంటల నిర్మాణం, నేలలో తేమ పెంపుపనులు, వాననీటి సంరక్షణ, కాంటూర్ కందకాలు, రాక్‌ఫిల్ డ్యామ్స్, అటవీ సరిహద్దు కందకాలు, భూగర్భజలాల పెంపు, ఊరూరా జలగణన, ఇతర జల సంరక్షణ నిర్మాణాలపై చర్చించారు. వర్షాలు పడిన వెంటనే నీరు భూమిలో ఇంకే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. పెరిగిన భూముల సాగు, పంటల విస్తీర్ణం, సాగు నీరు, నివాస ప్రాంతాలకు త్రాగునీరు, వనసంరక్షణ సమితులు, ఫారంఫాండ్స్, బోర్‌వెల్స్ రీఛార్జి, చెరువులలో నీటి నిల్వ, వాటర్ షెడ్ల ఏర్పాటు తదితర అంశాలను చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన పనులను త్వరిత‌గ‌తిన పూర్తి చేయాలని ఆదేశించారు. కడప జిల్లాలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణం బాగుందని ప్రశంసించారు. అక్కడ భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. అభివృద్ధిని పరిశీలించమని అధికారులను సూచించారు. జూన్‌లో నీటి సంఘాలకు ఎన్నికలు జరుగుతాయని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరులు, గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాలు, అటవీ, ఆంధ్రప్రదేశ్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్ధక, గ్రామీణ నీటిసరఫరా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *