ఉత్కంఠ రేపుతున్న లోకేష్ నామినేషన్

187

సీఎం చంద్రబాబు తనయుడు, నారా లోకేష్‌ నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. నామినేషన్‌ పేపర్లలో తప్పిదం కారణంగా లోకేష్‌ నామినేషన్‌ ఆమోదం పొందుతుందో లేదోనని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన లోకేష్‌ ఇంటి అడ్రస్‌ను తాడేపల్లి మండలం ఉండవల్లిగా పేర్కొన్నారు. దీనిని కృష్ణా జిల్లాకు చెందిన లాయర్‌ సీతారామ్‌ నోటరీ చేశారు.అయితే, తన పరిధిలోకి రాని గ్రామాన్ని నోటరీ ఎలా చేస్తారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి, మంగళగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. వివరణ ఇచ్చేందుకు లోకేష్‌ తరపు న్యాయవాది సీతారామ్‌ కొంత సమయం కావాలని రిటర్నింగ్‌ అధికారి వసుమా బేగంను కోరారు.

నోటరీ రూల్స్ ప్రకారం ఈ నామినేషన్ చెల్లదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎన్నికల అధికారులు పక్షపాత రహితంగా నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఒకవేళ లోకేష్, అతని తరపు న్యాయవాదులు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే… నామినేషన్‌ను తిరస్కరించే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే, ఇది పొరపాటే తప్ప.. తప్పిదం కాదంటున్న టీడీపీ నేతలు…అంత మాత్రాన నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క లోకేష్‌ నామినేషన్‌ ఆమోదానికి ఉన్నతస్థాయిలో ఒత్తిడులు పనిచేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here