వైసీపీ కీలకనేత, విజయవాడలో గట్టి పట్టున్న నేత వంగవీటి రాధాకృష్ణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారు..? అని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండ్రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రాధా స్పష్టం చేశారు. అంత వరకూ అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు సహకరించాలని కోరారు.
సైకిలెక్కనున్న రాధా..!?
ఇదిలా ఉంటే.. ఈనెల 24 లేదా ఆ తర్వాత వంగవీటి రాధా టీడీపీలో చేరే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు టీడీపీ కీలకనేతలు రాధాతో టచ్లో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని టీడీపీ ప్రతిపాదించినట్లు సమాచారం. రెండ్రోజుల్లో అనుచరులతో మాట్లాడి ఈ నెల 24 లేదా ఆ తర్వాత రాధా పార్టీలో చేరతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, అవనిగడ్డలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో టికెట్ ఇచ్చే అవకాశం లేక ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని టీడీపీ ప్రతిపాదించిందని తెలుస్తోంది. టీడీపీ ప్రతిపాదనతో రాధా సుముఖత వ్యక్తం చేశారని టీడీపీ వర్గాలు చెబుతాయి.